Corona compensation: కరోనా మృతుల సంఖ్యను తక్కువగా చూపిన రాజస్థాన్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం 8,955 మందే మరణించారని చెప్పడం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించింది. కరోనా పరిహారం కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు ప్రభుత్వం వద్ద లేకపోవడం ఏంటని ప్రశ్నించింది.
కరోనా మృతులకు పరిహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. తమ రాష్ట్రంలో 8,955 మంది కరోనాతో మరణించారని వారిలో 8,577 మంది కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించామని రాజస్థాన్ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాదాపు 90శాతం మంది బాధిత కుటుంబాలకు పరిహారం అందినట్లు చెప్పారు. అయితే కరోనాతో 8,955 మందే మరణించారని చెబితే ఎవరు నమ్ముతారు? అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం పరిహారం కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగింది. అయితే తమ వద్ద అందుకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవని రాజస్థాన్ ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏదో దాస్తుందని తమకు అనుమానంగా ఉందంది. అనంతరం ఈ వివరాలు తదుపరి విచారణ జరిగే 2022 జనవరి 17లోగా సమర్పించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. కరోనా మృతుల పరిహారంపై గుజరాత్ మోడల్‌ను అనుసరించి రెండు రోజుల ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది.
supreme court corona
- మహారాష్ట్రలో కరోనా పరిహారం కోసం 1,45,000 దరఖాస్తులు రాగా.. ప్రభుత్వం 8,000 మందికే చెల్లించింది. మిగతా వారికి వారం రోజుల్లోగా పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.
- కేరళలో 40వేల కరోనా మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు 528 కుటుంబాలకే పరిహారం చెల్లించినట్లు చెప్పింది. మొత్తం 10వేల దరఖాస్తులు అందాయని పేర్కొంది. 1,927మంది దరఖాస్తులు అంగీకరించినట్లు వివరించింది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర సంక్షేమం కోసం బాధితులకు పరిహారం చెల్లించడం ప్రభుత్వం బాధ్యత అని హితవు పలికింది. స్థానిక న్యూస్ పేపర్లలో విస్తృత ప్రచారం నిర్వహించి బాధితులకు వారం రోజుల్లోగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
- ఆంధ్రప్రదేశ్, అసోం రాష్ట్రాలు కూడా కరోనా పరిహారంపై పూర్తిస్థాయిలో ప్రచారం చేయట్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వారం రోజుల్లో పరిహారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలంది.
- గుజరాత్లో 40,467 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 26వేల మందికి పరిహారం చెల్లించామని, మిగతావారికి వారం రోజుల్లో చెల్లిస్తామని చెప్పింది.
- పంజాబ్‌లో 16,234 మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. 5,431 దరఖాస్తులు రాగా.. 2,480 కుటుంబాలకు పరిహారం చెల్లించినట్లు చెప్పింది. దరఖాస్తుల కోసం వేచి చూడకుండా ప్రజల వద్దకు వెళ్లి సాయం అందించాలంది కోర్టు.
- బంగాల్లో 19,630 మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం లెక్కలు చెప్పింది. 3,355మందికే పరిహారం చెల్లించినట్లు వెల్లడించింది. మిగతా వారికి 10 రోజుల్లో సాయం అందించాలని కోర్టు ఆదేశించింది.
- తమిళనాడులో 36,481 మరణాలు నమోదు కాగా.. 17, 448 మందికి పరిహారం అందింది. మిగతావారికి వారం రోజుల్లో సాయం అందజేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.
- గోవాలో 3,482 మరణాలు నమోదు కాగా.. 1,792 మందికి పరిహారం అందింది.
- తెలంగాణలో ఈనాడు పత్రికలో మాత్రమే ప్రకటనలు ఇస్తున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మిగతా పత్రికల్లో కూడా కరోనా పరిహారంపై యాడ్లు ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది.
covid compensation application