అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నా లెక్కచేయకుండా డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలు, సభలు నిర్వహించారు. మరోపక్క జోబైడెన్ వివేకంతో వ్యవహరిస్తూ.. సాధ్యమైనంత వరకు వర్చువల్ సమావేశాలకే పరిమితం అయ్యారు. బాధ్యతగా వ్యవహరించి.. మార్గదర్శిగా నిల్చారు.
అగ్రరాజ్య రాజకీయాలకు భారత రాజకీయాలు పూర్తిగా భిన్నమైనవి. ఇక్కడ బంగాల్ ఎన్నికల్లో పోటీపడి ర్యాలీలు నిర్వహించారు. చాలా సందర్భాల్లో నాయకులు కనీసం మాస్క్‌తో కూడా కనిపించలేదు. ఇది వారి అనుచరులకు ఏమి సంకేతాలు ఇస్తుందనే విషయాన్ని నేతలు పట్టించుకోలేదు. తొలిసారి లాక్‌డౌన్ విధించిన సమయంలో ప్రజలను రోడ్లపైకి రావద్దన్న పాలకులే .. బంగాల్‌లో భారీ జనసంద్రంతో ర్యాలీలు నిర్వహించారు. ఆ రాష్ట్రంలో 8 విడతల పోలింగ్ నిర్వహిస్తున్నందున రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్ని వదలకుండా అన్ని పార్టీల నాయకులు ర్యాలీలతో జల్లెడ పట్టారు. ఆ ఫలితాన్ని ఇప్పుడు ఆ రాష్ట్రం అనుభవిస్తోంది. అయినా.. నేతల తీరులో మాత్రం మార్పులేదు.
ఇదీ చదవండి:వృద్ధాశ్రమంలో 58మందికి కరోనా.. ఇద్దరు మృతి
ప్రచారాలతో 15 రెట్లు పెరిగిపోయి..
బంగాల్‌లో మార్చి 11న.. 3,110 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ సంఖ్య ఏప్రిల్ 20 నాటికి 53వేలకు చేరిందంటే ఎన్నికల ఎఫెక్ట్ అర్థం చేసుకోవచ్చు. దాదాపు 15 రెట్లు కేసులు పెరిగిపోయాయి. కేసుల పెరుగుదలకు చాలా కారణాలు ఉన్నా.. అతిపెద్ద కారణం మాత్రం భారీ సభలే. దీనికి ఎవరో ఒకరిని నిందించలేని పరిస్థితి! అన్ని పార్టీలు అదే స్థాయిలో సమావేశాలు నిర్వహించాయి. ఎన్నికల దశలు ముగిసే కొద్దీ ఆయా జిల్లాల్లో కేసులు పెరిగిపోతున్నట్లు covid19india.org లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఐదు విడతల ఎన్నికలే పూర్తయ్యాయి. మిగిలిన మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యే నాటికి బంగాల్ పరిస్థితి ఎలా మారుతుందో అని వైద్య నిపుణులు భయపడుతున్నారు.
- పురులియా జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మార్చి 7, ఏప్రిల్ 1న ఇక్కడ పోలింగ్ జరిగింది. మార్చి 20నాటికి 32కేసులు ఉండగా.. ఇప్పుడు అవి పదుల రెట్లు పెరిగి ఏప్రిల్ 20 నాటికి 1,440కు చేరాయి. మార్చి 18 నుంచి 27 మధ్యలో ఇక్కడ భారీ సంఖ్యలో ర్యాలీలు, సభలు జరిగాయి.
- దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఏప్రిల్ 1, 6, 10 తేదీల్లో మూడు విడతల ఎన్నికలు జరిగాయి. మార్చి 20 నాటికి ఇక్కడ 158 కేసులు ఉన్నాయి. ఏప్రిల్ 20 నాటికి అవి 3,518కి చేరాయి. అప్పటికి పోలింగ్ పూర్తై పది రోజులు అయింది. వైరస్ ఇంక్యుబేషన్ 14 రోజులు.. దీంతో మరిన్ని కేసులు పెరిగే ముప్పు పొంచి ఉంది.
- హౌరా, హుగ్లీ జిల్లాలో ఏప్రిల్ 6, 10న రెండు విడతల పోలింగ్ జరిగింది. హుగ్లీలో మార్చి 20న 97 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏప్రిల్ 20 నాటికి 2,446కు చేరాయి. ఇక హౌరాలో మార్చి 20న 218 ఉండగా.. అవి ఏప్రిల్20 నాటికి 3,390కి చేరాయి.
- ఇక.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ మార్చి 20న 897 యాక్టివ్ కేసులు ఉండగా.. ఏప్రిల్ 20 నాటికి అవి 12,407కు చేరాయి. ఇక్కడ ఎన్నికల ర్యాలీలే కాదు, పార్టీల మధ్య చోటు చేసుకొన్న భారీ ఘర్షణలు కూడా కొవిడ్ వ్యాప్తికి కారణం అయ్యాయి. ఇక్కడ ఏప్రిల్ 17న ఒక విడత పోలింగ్ మాత్రమే అయ్యింది. మరో విడత 22 తేదీన జరగనుంది. దీంతో ఇక్కడ కొవిడ్ కేసుల సంఖ్య ఏస్థాయికి చేరుతుందో అనే అందోళనలు ఉన్నాయి.
ఇదీ చదవండి:'ఐఎస్ఐతో సంప్రదింపులు.. ప్రతిపక్షాలకు తిరస్కారాలా?'