బంగాల్, అసోంలో కొవిడ్ కేసులు (corona cases updates) పెరుగుతున్నాయి. వారపు పాజిటివిటీ రేటులోనూ పెరుగుదల నమోదవుతుండటంతో పాటు కరోనా పరీక్షలు తగ్గుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. కట్టుదిట్టంగా కొవిడ్ నిబంధనలను అమలు చేయాలని, కరోనా పరీక్షలు పెంచాలని సూచించింది. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా బంగాల్, అసోం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. అస్సాంకు రాసిన లేఖలో.. అక్టోబరు 20-26 తేదీల మధ్య 41 శాతం కొవిడ్ కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. గత 4 వారాలుగా (ఈనెల 25 నాటికి) పాజిటివిటీ రేటు కూడా 1.89% నుంచి 2.22%కి పెరిగినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు.. సెప్టెంబరు 28 - అక్టోబరు 4 వారంలో 1,64,071 నిర్వహించగా ఆ సంఖ్య అక్టోబరు 19-25 వారానికి 1,27,048కి తగ్గిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. బెంగాల్‌లో గత వారం రోజుల్లో 41 శాతం కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. 4 వారాల్లో పాజిటివిటీ రేటు 1.93 శాతం నుంచి 2.39 శాతానికి పెరిగిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇక్కడ కూడా కరోనా పరీక్షలు తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తగిన విధంగా కంటెయిన్‌మెంట్ జోన్లను నిర్వహించాలని.. వీటి పరిధిలో ఇంటింటికీ వెళ్లి కేసులను గుర్తించాలని స్పష్టం చేశారు.
24 గంటల్లో 14,313 కొవిడ్ కేసులు