Corona cases in Maharashtra: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మహారాష్ట్రలో బుధవారం.. 2701 కేసులు రాగా.. గురువారం 2,813 కొత్త కేసులతో పాటు ఒక మరణం నమోదైంది. 1047 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో దాదాపు నాలుగు నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. తాజాగా బయటపడిన ఇన్ఫెక్షన్లతో మహారాష్ట్రలో క్రియాశీల కేసుల సంఖ్య 11,571కి పెరిగింది. ముంబయిలోనే ఏకంగా 1,702 కేసులు నమోదు కావడం గమనార్హం. తాజా కేసులతో కలిపితే మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 79,01,628కి చేరింది. వీటిలో 77,42,190 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,47,867 మంది మృతిచెందారు. ప్రస్తుతం 11,571 క్రియాశీల కేసులు ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 7,998 యాక్టివ్ కేసులు ఉండగా.. ఠానేలో 1984, రాయిగఢ్‌లో 319 చొప్పున ఉన్నాయి.
దిల్లీలో ఇద్దరి మృతి
దిల్లీలోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 19,619 టెస్టులు చేయగా.. 622 మందిలో ఈ మహమ్మారి వెలుగుచూసింది. తాజాగా 537మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. కరోనాతో పోరాడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో దిల్లీలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 19,10,613కి చేరింది. వీరిలో 18,82,623 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 26,216 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,774కి చేరింది.