కర్ణాటకలో మరో 47వేల మందికి కరోనా.. కేరళలో గరిష్ఠస్థాయికి కొత్త కేసులు - మహారాష్ట్ర కేసులు
Corona Cases in India: పలు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కర్ణాటకలో మరో 47ల మందికి వైరస్ సోకింది. కేరళలో ఒక్కరోజే 46వేల కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇవే అత్యధికమని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోనూ కొత్తగా 46వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులు
By
Published : Jan 20, 2022, 7:38 PM IST
|
Updated : Jan 20, 2022, 10:03 PM IST
Corona Cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో మహమ్మారి పంజా విసురుతోంది. గురువారం ఒక్కరోజే 47,754 మందికి సోకింది వైరస్. ఈ ధాటికి మరో 29 మంది మరణించారు. 22,143 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 18.48శాతంగా నమోదైంది. రాష్ట్రంలో క్రియాశీల కేసులు 2,93,231కి చేరాయి.
కేరళలో గరిష్ఠ స్థాయికి కొత్త కేసులు
కేరళలో వైరస్ విలయం కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే.. 46,387 కేసులు, 341 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో కొత్తవి 32 కాగా.. 309 కొత్త మార్గదర్శకాల ప్రకారం నమోదు చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం మరో 62 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినట్లు తెలిపింది.
2020లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికమని ఆరోగ్య శాఖ తెలిపింది. అంతకు ముందు 2021, మే 12న నమోదైన 43,529 కేసులే అత్యధికమని పేర్కొంది.
మహాలో మరో 46వేల కేసులు..
మహారాష్ట్రలో గురువారం కొత్తగా 46,197 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 37 మంది మరణించారు. 125 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బుధవారం 43వేల కొత్త కేసులు రాగా.. దాదాపు 3వేల కేసులు పెరిగాయి.
కొత్త కేసుల్లో ముంబయిలోనే 5,708 మందికి వైరస్ సోకగా.. 12 మంది మరణించారు.
దిల్లీలో..
దిల్లీలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 12,306 మందికి వైరస్ సోకింది. 43 మంది మరణించారు. అయితే.. రోజువారీ పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గి.. 21.48కి చేరింది. 2021, జూన్ 10 తర్వాత ఈ స్థాయిలో మరణాలు సంభవించటం ఇదే తొలిసారి.
ఒడిశాలో..
ఒడిశాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 10,368 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,77,462కు చేరింది. ఏడుగురు మరణించగా.. గడిచిన మూడు నెలల్లో ఇదే అత్యధికం. కొత్త కేసుల్లో 1,090 మంది చిన్నారులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
బిహార్‌లో ఆంక్షల పొడిగింపు..
కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఆంక్షలు పొడిగించింది బిహార్ ప్రభుత్వం. 2022, ఫిబ్రవరి 6 వరకు ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ట్వీట్ చేశారు.