Corona cases in India: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు దిగొస్తున్నాయి. కేరళలో శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం మరో 50,812 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 8 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 59.31 లక్షలు దాటింది. మరణాలు 53,191కి చేరాయి. 47,649 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
కర్ణాటకలో మరో 33వేల కేసులు
కర్ణాటకలో వైరస్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. శనివారం కొత్తగా 33,337 మందికి వైరస్ సోకింది. మరో 70 మంది వైరస్‌కు బలయ్యారు. 69,902 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 19.37 శాతంగా ఉంది.
రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత..
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. జనవరి 31 నుంచి 1-9వ తరగతులకు పాఠశాలలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే.. మహారాష్ట్ర, కేరళ, గోవాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి నిబంధనలు అమలులోనే ఉంటాయని పేర్కొంది.