Corona Cases in India: పలు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కర్ణాటకలో మరో 48ల మందికి వైరస్ సోకింది. కేరళలో 41వేల కేసులు వెలుగుచూశాయి. రాజస్థాన్‌లో కొత్త కేసులు 8 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.
కరోనా
By
Published : Jan 21, 2022, 8:33 PM IST
|
Updated : Jan 21, 2022, 10:57 PM IST
Corona Cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 48,049 కొత్త కేసులు వచ్చాయి. 22 మంది మరణించారు. 18,115 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 19.23 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో క్రియాశీల కేసులు 3,23,143గా ఉన్నాయి.
మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో శుక్రవారం కొత్తగా 48, 270 కేసులు నమోదయ్యాయి. 52 మంది మరణించారు. 144 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 2,073 కేసులు అధికంగా నమోదయ్యాయి. కొత్త కేసుల్లో పుణెలో 8,464, ముంబయిలో 5,008 కేసులు వచ్చాయి.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
కేరళలో తగ్గిన కేసులు..
కేరళలో క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం మరో 41,668 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55,29,566కు చేరింది. 106 మంది మరణించారు.
దిల్లీలో..
దేశ రాజధాని దిల్లీలో వైరస్ ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది. శుక్రవారం కొత్తగా 10,756 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,494 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 5.16 శాతంగా ఉంది.
దిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ(డీడీఎంఏ). ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బంది సామర్థ్యంతో పని చేసేందుకు అనుమతించింది. అయితే, వారాంతపు కర్ఫ్యూ సహా ఇతర ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. నగర మార్కెట్లో దుకాణాలు తెరిచేందుకు సరి-బేసి పద్ధతి కొనసాగుతుందని తెలిపింది.
రాజస్థాన్‌లో 8 నెలల గరిష్ఠానికి కేసులు
రాజస్థాన్‌లో రోజువారీ కరోనా కేసులు 8 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. శుక్రవారం కొత్తగా 16,878 మందికి వైరస్ సోకగా.. 15 మంది మృతి చెందారు. అందులో ఒక్క జైపుర్‌లోనే 4,035 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 84,787గా ఉంది.