Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 196 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,46,77,302
- మరణాలు: 5,30,695
- యాక్టివ్ కేసులు: 3,428
- రికవరీలు: 4,41,43,179
Vaccination In India: దేశంలో ఆదివారం 29,818 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,05,46,067 కు చేరింది. ఒక్కరోజే 35,173 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 289,639 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 616 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 661,756,874కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,686,012 మంది మరణించారు. మరో 218,820 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 634,246,517కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 1,49,665 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 306 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియా 58,448 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 46 మంది మృతి చెందారు.
- హాంగ్‌కాంగ్‌లో 21,255 కొత్త కేసులు నమోగవ్వగా..46 మంది చనిపోయారు.
- అమెరికాలో 17,728 వెలుగుచూడగా.. 24 మంది మృతిచెందారు.
20 రోజుల్లో 25 కోట్ల మందికి కొవిడ్
చైనాలో కొవిడ్-19 విజృంభణ ఊహించిన దానికంటే భయానకంగా ఉంది. అక్కడ డిసెంబరు నెలలోని తొలి 20 రోజుల్లో 25 కోట్ల మందికి వైరస్ సోకింది. బుధవారం జరిగిన చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) సమావేశంలో ఈ సంఖ్య బయటకు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్, ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలు పేర్కొన్నాయి. ఎన్‌హెచ్‌సీ సమావేశ వివరాలున్న నోట్ శుక్రవారం చైనా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీని ప్రకారం.. చైనాలోని ఉన్న 140 కోట్ల జనాభాలో 18% మంది 20 రోజుల్లో వైరస్ బారినపడ్డారు. చైనా ఎన్‌హెచ్‌ఎస్ డిప్యూటీ డైరెక్టర్ సున్ యాంగ్ అంచనాల మేరకు దేశంలో కొవిడ్ వ్యాప్తి రేటు ఇంకా పెరుగుతోంది. బీజింగ్, సిచువాన్‌లలో దాదాపు సగం మందికి కొవిడ్ సోకిందని ఆ సమావేశంలో అంచనా వేశారు.
వాస్తవానికి ఈ 20 రోజుల్లో చైనా అధికారికంగా ప్రకటించిన కేసుల సంఖ్య 62,592 మాత్రమే. ఈ నెలలో ఒక్కరు మాత్రమే మరణించినట్లు జిన్‌పింగ్ సర్కారు వెల్లడించింది. మరోవైపు, డ్రాగన్ దేశంలో ఇప్పటి వరకు 80ఏళ్లకు పైబడిన వారిలో కేవలం 42 శాతం మంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చైనాలోని క్వింగ్‌డావ్‌లో ఒక్క రోజులోనే 5,30,000 కేసులు వచ్చినట్లు మున్సిపల్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయం చైనా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో అధికారులు దానిని తొలగించారు. ఆదివారం నుంచి చైనాలో కొవిడ్ కేసుల సంఖ్యను అధికారికంగా ప్రకటించబోమని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది. కొవిడ్‌కు సంబంధించిన సమాచారన్ని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం ప్రచురిస్తుందని తెలిపింది.