Corona Cases in India : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 185 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి ఒకరు మరణించారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,46,76,515
- మరణాలు: 5,30,681
- యాక్టివ్ కేసులు: 3,402
- రికవరీలు: 4,41,42,432
Vaccination In India :
దేశంలో బుధవారం 66,197 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,02,12,178కు చేరింది. ఒక్కరోజే 1,17,538 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కొవిడ్ విజృంభణపై ప్రధాని సమీక్ష
దేశంలోని కొవిడ్ వైరస్ విజృంభణపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఉన్నత స్థాయి సమవేశంలో కొవిడ్‌కు సంబంధించిన అన్ని అంశాలను మోదీ అధికారులతో చర్చించనున్నారు.
భారత్‌లో బీఎఫ్-7 వేరియంట్..
తొలిసారి కొవిడ్ బయటపడిన చైనాలో ఆ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అయితే, అక్కడ వైరస్ విజృంభణ ఒమిక్రాన్ ఉపరకం బీఎఫ్-7 కారణమని నిపుణులు తేల్చారు. ఈ వేరియంట్ భారత్‌లోనూ బయటపడింది. తొలి కేసును గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా బీఎఫ్-7 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 4 నమోదైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో 3 గుజరాత్‌లో నమోదుకాగా.. మరో కేసు ఒడిశాలో వెలుగుచూసినట్లు పేర్కొన్నాయి.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 586,296 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,577 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 659,571,124కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,678,200 మంది మరణించారు. మరో 343,792 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 632,629,588కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 206,943 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 296 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియా 88,172 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 59 మంది మృతి చెందారు.
- ఫ్రాన్స్‌లో 54,613 కొత్త కేసులు నమోదవ్వగా.. అమెరికాలో 51,121 వెలుగుచూశాయి.
- చైనాలో 5,241 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి.