తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5 కోట్ల కార్బివాక్స్‌ డోసులకు కేంద్రం ఆర్డర్‌.. అందుకోసమేనా..? - కార్బివాక్స్‌ టీకా

Corbevax Covid Vaccine: కార్బివాక్స్‌ టీకా 5 కోట్ల డోసుల కోసం హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఇ సంస్థకు కేంద్రం ఆర్డర్‌ పెట్టినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. ఒక్కో డోసును రూ. 145(జీఎస్‌టీ అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేయనుంది.

Corbevax Covid Vaccine
కార్బివాక్స్‌ టీకా

By

Published : Feb 5, 2022, 10:44 PM IST

Corbevax Covid Vaccine: కరోనా మహమ్మారిని అడ్డుకునే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ప్రికాషనరీ డోసు పంపిణీని విస్తరించాలని భావిస్తోంది. ఇందుకోసం మరిన్ని డోసుల కొనుగోలును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ - ఇ అభివృద్ధి చేసిన కార్బివాక్స్‌ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు కేంద్రం ఆర్డర్‌ పెట్టినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. ఒక్కో డోసును రూ. 145(జీఎస్‌టీ అదనం) చొప్పు వీటిని కొనుగోలు చేయనుంది. ఈ డోసులను ఫిబ్రవరి చివర నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ టీకాను ఎవరికి అందిస్తారన్న దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రికాషనరీ డోసుగా దీన్ని పంపిణీ చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, 60ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రికాషనరీ డోసును పంపిణీ చేస్తోంది. రానున్న రోజుల్లో 60ఏళ్ల లోపు వారికి కూడా మూడో డోసు పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తోంది. వీరికి ప్రికాషనరీ డోసుగా కార్బివాక్స్‌ను ఇచ్చే అవకాశాలున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

ఆర్‌బీడీ ప్రొటీన్‌ ఆధారిత తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ అయిన కార్బివాక్స్‌ అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. అయితే ఈ టీకాకు అనుమతులు రాకముందే 30 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం.. బయోలాజికల్‌ - ఇ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 1500కోట్లు చెల్లించింది కూడా. ఈ ఒప్పందంలో భాగంగానే డోసుల కొనుగోలుకు తాజాగా ఆర్దర్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:'కేసులు తగ్గుతున్నాయ్​- సుప్రీంలో భౌతిక విచారణ చేపట్టండి'

ABOUT THE AUTHOR

...view details