Mob attack on police: మహారాష్ట్ర, పల్ఘర్ జిల్లాలోని ఓ ఉక్కు పరిశ్రమలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపై మూకదాడి జరిగింది. స్టీల్ కంపెనీ ఉద్యోగులపై వంద మందికిపైగా కార్మిక సంఘ సభ్యులు దాడికి పాల్పడేందుకు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. 19 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. వారి 12 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 27 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బైసర్ నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో శనివారం ఈ సంఘటన జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నా అదుపులోనే ఉన్నాయని పోలీసు అధికారి సచిన్ నవాద్కర్ తెలిపారు. 'లేబర్ యూనియన్‌కు సంబంధించిన అంశంపై గొడవ జరిగింది. శనివారం కొంతమంది యూనియన్ సభ్యులు పరిశ్రమలోకి వెళ్లి ఉద్యోగులు, అధికారులపై దాడికి దిగారు. ప్రాంగణంలోని వస్తువులను ధ్వంసం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి రాళ్లదాడికి పాల్పడ్డారు.' అని పేర్కొన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.