విపత్తులపై పోరుకు దేశాల మధ్య సహకారం తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'విపత్తులపై పోరాటానికి మౌలిక సదుపాయాలు' అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంభవించిన విపత్తులు మరో ప్రాంతానికి వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపిన ప్రధాని... దీన్ని అరికట్టేందుకు తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దేశాలు తమపై తామే ఆధారపడవచ్చనే పాఠాన్ని కరోనా నేర్పిందన్న ప్రధాని.. ఈ పాఠాలను అన్ని ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు అమలు చేయాలని హితవు పలికారు.
ఉమ్మడి శత్రువుపై కలిసి పోరాటం చేయవచ్చనే విషయాన్ని కూడా కరోనా తెలియజెప్పిందని మోదీ అన్నారు. ప్రపంచాన్ని అనుసంధానం చేస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాలు, నౌకా మార్గాలు, విమానయాన వ్యవస్థలను విపత్తులపై పోరాటానికి వినియోగించుకోవాలని ప్రధాని ప్రపంచ దేశాలకు సూచించారు.