కొవిడ్ వ్యాక్సినేషన్ అంశంపై చర్చ విషయమై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈమేరకు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ నేతృత్వంలో బుధవారం స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానం (రెండు డోసుల మధ్య విరామం పెంపు వంటివి)పై ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నలు అడిగేందుకు ఉద్యుక్తులు కాగా దీన్ని భాజపా ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీఎత్తున వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తరుణంలో దీన్ని చర్చించకూడదని పట్టుబట్టారు. కొందరు సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ దీనిపై ఓటింగ్ జరపాలని కోరారు. ఛైర్మన్ జైరాం రమేశ్ అంశాలవారీగా డిమాండ్లను తిరస్కరించారు. ఏకాభిప్రాయంతో స్థాయీసంఘ సమావేశాలు జరగాలని అన్నారు.
ఈ సందర్భంగా కొందరు భాజపా సభ్యులు వాకౌట్ చేసినట్లు సమాచారం. ప్రతిపక్ష ఎంపీలు మాత్రం తాము ప్రజలకు జవాబుదారీ అయినందున ప్రశ్నించే హక్కు తమకు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం సంబంధిత ఉన్నతాధికారులను పిలిపించి వివరాలను అడిగి తెలుసుకోవడంతో వివాదం ముగిసింది. రికార్డు సమయంలో వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను స్థాయీసంఘం ఈ సందర్భంగా అభినందించింది. స్థాయీసంఘం ముందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. పిల్లలకు వ్యాక్సిన్ అందించే అంశంపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని, ఆగస్టులో అవి అందుబాటులోకి రావొచ్చని వారు అభిప్రాయపడినట్లు సమాచారం.