సాధారణంగా బస్సు ఎక్కితే చిల్లర లేక కొన్నిసార్లు ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. ఛార్జీకి తగ్గ చిల్లర లేకపోవడం వల్ల రూ.100, రూ.500 నోట్లు ఇస్తుంటారు. కండక్టర్ చిల్లర లేదు.. బస్సు దిగేటప్పుడు ఇస్తానని చెబుతుంటారు. కొన్నిసార్లు రూ.10 ఛార్జీ చిల్లర లేక రూపాయి తరువాత ఇస్తానని అంటారు. అయితే తనకు ఇవ్వాల్సిన రూపాయి ఇవ్వనందుకు ఓ ప్యాసింజర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. మూడేళ్లుగా పోరాడి విజయం సాధించాడు. అసలు ఏం జరిగిందంటే?
రమేశ్ నాయక్ అనే వ్యక్తి 2019 సెప్టెంబరు 11న బెంగళూరులోని శాంతినగర్‌లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) వాల్వో బస్సు ఎక్కాడు. అతడి బస్సు టిక్కెట్ ఛార్జీ రూ.29 కాగా.. కండక్టర్‌కు 30 రూపాయలు ఇచ్చాడు. అయితే కండక్టర్ రూపాయి చిల్లర రమేశ్ నాయక్‌కు తిరిగి ఇవ్వలేదు. దీంతో బీఎంటీసీ.. తనకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని బెంగళూరు నాల్గో అదనపు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు రమేశ్. ఈ క్రమంలో.. రమేశ్ నాయక్ వేసిన వ్యాజ్యంపై బీఎంటీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదొక సిల్లీ కేసు అని కోర్టుకు తెలిపింది. ఫిర్యాదును కొట్టివేయాలని వినియోగదారుల కోర్టును కోరింది.
అయితే దీనిపై విచారించిన వినియోగదారుల కోర్టు రమేశ్‌కు రూ.3 వేలు పరిహారం ఇవ్వాలని బీఎంటీసీని ఆదేశించింది. రూ. 2 వేలు పరిహారం, కోర్టుకు హాజరయ్యేందుకు రమేశ్‌కు అయ్యిన ఖర్చుల నిమిత్తం మరో రూ.1,000 చెల్లించాలని పేర్కొంది.