Ayodhya Ram Mandir Construction: అయోధ్య రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పనులను పూర్తి చేసి 2024 జనవరి నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని భావిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. పనులు అనుకున్న ప్రకారం సాగుతున్నాయన్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ 2023 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రామమందిరాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పనులు అనుకున్న ప్రకారం ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు.. సంక్రాంతి రోజు విగ్రహ ప్రతిష్ఠాపన!
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు పూర్తవ్వగా ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆలయ కమిటీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2024 జనవరి నుంచి భక్తులకు శ్రీరాముడిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2023 డిసెంబర్ నాటికి ఆలయ పనులు పూర్తవ్వనున్నాయి. 2024 జనవరి నుంచి ఆలయాన్ని భక్తుల కోసం తెరుస్తారు. 2024 జనవరి 1 కల్లా అయోధ్యలో రామమందిరం సిద్ధమవుతుందని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మకర సంక్రాంతి పర్వదినాన ఆలయం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఆలయానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ 'సోమ్‌పురా ఫ్యామిలీ' అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది. అయోధ్యలో భవ్య రామ మందిరంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలు ఉంటాయి. 2.77 ఎకరాల విస్తీర్ణం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉంటుంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు కాగా మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, తొలి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి.