తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త పార్లమెంట్​ భవన నిర్మాణ పనులకు నేడు శ్రీకారం

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హెరిటేజ్ కన్జర్వేటివ్‌ కమిటీ అనుమతుల మంజూరుతో పనుల ప్రారంభానికి మార్గం సుగమమైంది. మకర సంక్రాంతి మరుసటిరోజును అత్యంత పవిత్రంగా భావించి నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు.

Construction of new parliament building to begin tomorrow
నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి నేడు శ్రీకారం

By

Published : Jan 15, 2021, 5:16 AM IST

కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు శుక్రవారం నుంచి మొదలుకానున్నాయి. మకర సంక్రాంతి ముగిసిన మరుసటిరోజు పవిత్రంగా భావించి పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రజా పనుల విభాగం కోరిన మేరకు పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందిన టాటా ప్రాజెక్ట్స్​‌ లిమిటెడ్‌ పనులను ప్రారంభించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. 14 మంది సభ్యుల హెరిటేజ్‌ కన్జర్వేటివ్‌ కమిటీ సెంట్రల్‌ విస్టా పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ పనులు ప్రారంభించటానికి ముందు హెరిటేజ్‌ కన్జర్వేటివ్‌ కమిటీతో పాటు సంబంధిత శాఖల అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత విభాగాల నుంచి అనుమతులు పొందిన తర్వాతనే పనులు చేపడుతోంది.

ఇదివరకే సంబంధిత ప్రభుత్వ విభాగం నుంచి సమాచారం అందుకున్న టాటా ప్రాజెక్స్ట్​ లిమిటెడ్‌... నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన యంత్రాలు, ఇతర సామాగ్రిని తరలించింది.

త్రిభుజాకారం..

సెంట్రల్‌ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగంగా దేశ అధికార కేంద్రంగా భావించే పార్లమెంటు భవనాన్ని త్రిభుజాకారంలో నిర్మించనున్నారు. అణువణువునా భారతీయత ప్రతిబింబించే విధంగా నూతన పార్లమెంట్‌ భవనం రూపుదిద్దుకోనుంది. ఒకేసారి 1,272 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా నిర్మిస్తున్నారు. లోక్‌సభలో 888మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా కొత్త భవనం నిర్మితం కానుంది. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకూ 3కిలోమీటర్ల మేర రాజ్‌పథ్‌ను ఆధునీకరించనున్నారు. కేంద్ర సచివాలయ భవనం ప్రధానమంత్రి నూతన నివాసం, కార్యాలయంతోపాటు ఉప రాష్ట్రపతి కొత్త నివాస భవన నిర్మాణం చేపట్టనున్నారు.

రాజ్‌పథ్‌ ఆధునీకరణ పనులు గణతంత్ర దినోత్సవ పరేడ్‌ తర్వాత ప్రారంభంకానున్నాయి. 10 నెలల్లో పనులు పూర్తిచేసి 2022 రిపబ్లిక్‌ వేడుకల పరేడ్​ను‌ పునరాభివృద్ధి చేసిన రాజ్‌పథ్‌లో జరపాలని కేంద్రం భావిస్తోంది. గత డిసెంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి భూమి పూజచేశారు. 971కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనాన్ని 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం.. గుత్తేదారు సంస్థకు లక్ష్యం నిర్దేశించింది.

ఇవీ చదవండి: సశక్త దేశానికి ఘన ప్రతీక మన పార్లమెంట్​

సెంట్రల్​ విస్టా: 15ఎకరాల్లో ప్రధాని నివాస సముదాయం

ABOUT THE AUTHOR

...view details