Constitution day of India:బ్రిటిష్ పాలనలో సంస్కరణలు తేవాలన్న డిమాండ్‌తో మొదలైన .. జాతీయోద్యమం తర్వాతి దశలో పాలనలో భారతీయులకూ భాగస్వామ్యం కల్పించాలని కోరింది. 1919 కల్లా.. స్వయంప్రతిపత్తికి డిమాండ్ మొదలైంది. భారతీయులింకా తమనుతాము పాలించే స్థితికి చేరుకోలేదని చెబుతూ.. బ్రిటిష్ సర్కారు తమదైన నిబంధనలతో.. 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం తీసుకొచ్చింది.
దీంతో.. బ్రిటిష్‌వారిని ఒప్పించటానికిగాను.. 1925లో స్వయం ప్రతిపత్తిగల భారత రాజ్యాంగం ఇలా ఉంటుందని నిర్దిష్టంగా చెప్పే ప్రయత్నం జరిగింది. హోంరూల్ ఉద్యమకర్త అనిబిసెంట్ సారథ్యంలో.. తేజ్ బహదూర్ సప్రూ, వి.ఎస్.శ్రీనివాస శాస్త్రిల ఆధ్వర్యంలో దీన్ని తయారు చేశారు. బ్రిటన్ రాచరికానికి లోబడే సాగే స్వయం పాలనలో.. ప్రాథమిక హక్కులు, ఉచిత ప్రాథమిక విద్య, భావ ప్రకటన స్వేచ్ఛ, వివక్షలేని సమాజం.. ఇలా చాలా అంశాలను పొందుపరిచారు. అన్ని పార్టీలతో సంప్రదించి సవరణలు చేసి.. పది అధ్యాయాలు, 127 ఆరిక్టల్స్‌తో రూపొందించిన దీన్ని కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లుగా లేబర్‌పార్టీ కీలక సభ్యుడు జార్జ్ లాన్స్‌బరీ బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ ఎన్నికల్లో లేబర్‌పార్టీ ఓడిపోవటంతో ఈ బిల్లు మరుగున పడిపోయింది.
అదే సమయంలో.. బ్రిటన్ ప్రభుత్వంలో భారత వ్యవహారాలు చూసే మంత్రి లార్డ్ బిర్కెన్‌హెడ్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ''తమ దేశవాసులందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని భారతీయుల్ని రాసి చూపమనండి చూద్దాం'' అంటూ సవాలు విసిరారు. తాము పెట్టిన మత విభజన ఉచ్చులో పడ్డ భారత్‌లో అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగం (Constitution day celebration) రాసుకోవటం అసాధ్యమనేది బ్రిటిష్‌వారి ప్రగాఢ విశ్వాసం.
కానీ.. భారత జాతీయోద్యమ నేతలు- బిర్కెన్‌హెడ్ సవాలును స్వీకరించారు. 1927లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ సదస్సులో ఈ మేరకు తీర్మానం చేశారు. భారత రాజ్యాంగ రచనకు అన్ని పార్టీలతో కమిటీని ఏర్పాటు చేశారు. 1928 మే 19న రాజ్యాంగ రచనకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మోతీలాల్ నెహ్రూ ఛైర్మన్‌గా, ఆయన కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ కార్యదర్శిగా ఏర్పాటైన ఈ కమిటీలో అలీఇమాం, తేజ్‌బహదూర్ సప్రూ, సుభాష్ చంద్రబోస్, ఎం.ఆర్.జయకర్, అనిబిసెంట్ సభ్యులు.