మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద.. కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బాగుపడాలంటే పార్టీకి శస్త్రచికిత్స అవసరమని పేర్కొన్నారు. వారసత్వాన్ని మాత్రమే కాంగ్రెస్ నమ్ముకోకూడదన్న ఆయన.. రాజకీయాల్లో పోటీతత్వాన్ని కాంగ్రెస్ అలవరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక నిబద్ధత ఉన్న నేతలనే అధిష్ఠానం ప్రోత్సహించాలని కోరారు. జితిన్ ప్రసాద నిబద్ధతపై మొదటి నుంచీ అనుమానాలే ఉన్నాయన్నారు.
"సరైన స్థానాల్లో సరైన వ్యక్తుల్ని నియమించి పార్టీని పునవ్యవస్థీకరించాలి. అసమర్థులైన వ్యక్తులకు కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టకూడదు. కాంగ్రెస్కు ఇది ఓ పాఠం. పార్టీలో ఉన్న లోటుపాట్లను కాంగ్రెస్ పునరాలోచించుకుని సరైన వ్యూహాన్ని అమలు చేస్తేనే పునర్వైభవం సాధించగలుగుతుంది."