ఉత్తర్‌ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. 'ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దంటూ కార్యకర్తలు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. "కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా" అంటూ బులంద్‌షహర్‌లో జరిగిన ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రియాంక.
ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ఆమె.. దేశాన్ని కుదిపేసిన ఉన్నవ్, హథ్రాస్ అత్యాచారం, హత్య ఘటనలు జరిగిన సమయాల్లో ఎస్పీ, బీఎస్పీ నేతలు ఎక్కడా కనిపించలేదని ప్రియాంక మండిపడ్డారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజల తరఫున పోరాడుతోందన్నారు.
బులంద్‌షహర్‌లో జరిగిన ప్రతిజ్ఞ సమ్మేళన్ లక్ష్య-2022లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రియాంక.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి "డూ-ఆర్-డై" వంటివని పోల్చారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారానే విజయం సాధించగలమని ఉద్ఘాటించారు. సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండాలని.. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
తన ప్రసంగంలో భాగంగా అధికార భాజపాపై ప్రియాంక విరుచుకుపడ్డారు.
"భాజపా నేతలకు స్వాతంత్య్రోద్యమంపై గౌరవం లేదు. దేశంకోసం వారు రక్తం చిందించలేదు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, అంబేద్కర్ వంటి నాయకులు నిబద్ధతతో పనిచేశారు."
---ప్రియాంక గాంధీ