Congress vs G23: కాంగ్రెస్లో రెండు వర్గాల నేతల మధ్య మాటల వేడి పెరుగుతోంది. గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండే నేతలు... జీ23 వర్గంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గాంధీ కుటుంబం పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని కపిల్ సిబల్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయనపై ఎదురుదాడికి దిగారు మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ ఎంతో ప్రయోజనం పొందారని, అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఇలా ఫిర్యాదులు చేయడం దురదృష్టకరమని అన్నారు. పార్టీ తరఫున ఆయన ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేశారని ప్రశ్నించారు. గాంధీ కుటుంబమే పార్టీని ఐక్యంగా ఉంచుతోందని వ్యాఖ్యానించారు.
"ఇలాంటి సంక్షోభ సమయంలో పార్టీని ఐక్యంగా ఉంచేది గాంధీ కుటుంబమే. రాహుల్ గాంధీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఉండాలని పార్టీలోని నేతలందరూ భావిస్తున్నారు. ఆగస్టులో ఎన్నికలు జరిగి.. పార్టీ అధ్యక్షుడిగా ఆయన గెలుపొందాలని మేమంతా ఎదురుచూస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేయకుండా కపిల్ సిబల్ రాజ్యసభకు వెళ్లారు. ఆయనకు గౌరవం ఇచ్చి పార్టీ ఆ బాధ్యతలను అప్పగించింది. దానికి ఎవరూ ఎదురుచెప్పలేదు. గాంధీ కుటుంబం తరతరాలుగా చేసిన కృషి వల్లే ఇన్నేళ్లు అధికారంలో ఉన్నాం. దీనికి మేమంతా(జీ23నేతలను ఎద్దేవా చేస్తూ) అలవాటుపడిపోయాం. ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి కలత చెందుతున్నాం. అంతర్గత కలహాలు పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడవు. భాజపాకే ప్రయోజనం."
-సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ నేత
congress leadership crisis