రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల సయమంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్ దర్యాప్తు ప్రారంభించడమే ఇందుకు కారణం. రఫేల్ డీల్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి డిమాండ్ లేవనెత్తింది. ఇందుకు ప్రధాని మోదీ తక్షణమే ఆదేశాలివ్వాలని కోరింది.
"రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, రాహుల్‌గాంధీ చేసిన వాదనే నిజమని తేలింది. అక్రమాలు జరిగాయని ఫ్రాన్స్ ప్రభుత్వమే అంగీకరించినప్పుడు మన దేశంలో దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో ఎందుకు దర్యాప్తు చేయించకూడదు. ఇది దేశ భద్రత, సమగ్రతకు సంబంధించిన విషయం గనుక దీనిపై స్వతంత్ర దర్యాప్తు ఒక్కటే మార్గం. ప్రధాని స్వయంగా ముందుకొచ్చి దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలి"
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఇక్కడ సమస్య భాజపా.. కాంగ్రెస్ మధ్య కాదని, దేశ భద్రతకు సంబంధించినదని సూర్జేవాలా అన్నారు. ఈ అంశం తమ పరిధి కాదని సుప్రీం కోర్టు ఇప్పటికే తేల్చినందువల్ల, దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించబోమని చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా రఫేల్ అంశంపై విమర్శలు చేశారు. "సూర్యుడు, చంద్రుడు, సత్యాన్ని ఎల్లకాలం దాచడం కుదరదు" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.
ఏజెంటుగా రాహుల్: భాజపా