Congress vs AAP: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందగా.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అఖండ విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనావస్థలో ఉన్న కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బలీయ పోటీదారుగా నిలవాలంటే తాత్కాలిక చికిత్సలు చాలవు. కాయకల్ప చికిత్సే జరగాలి. మున్ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగానైనా దేశంలో నిలుస్తుందా అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలనూ అవతలకు నెట్టేసిన 'ఆప్' 117 సీట్లకు 92 గెలుచుకోవడం అనూహ్య పరిణామం. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లలో కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడింది. దేశంలో నేడు ఆప్, కాంగ్రెస్ పార్టీల చేతుల్లో చెరో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఆప్ దిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాలను ఏర్పరిస్తే.. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మాత్రమే ప్రభుత్వాలు నడుపుతోంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామ్యంతో సరిపెట్టుకుంటోంది. కాంగ్రెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేసి పటిష్ఠంగా పునర్వ్యవస్థీకరణ చేయాలని గతంలోనే 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినా అధిష్ఠానం పెడచెవిన పెట్టింది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశంలో కాంగ్రెస్ ఉనికికి మరింత ఎసరు తెస్తున్నాయి. ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యామ్నాయ స్థానం కోసం పోటీపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆప్ జోరుకు కాంగ్రెస్ విలవిల.. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా! - congress in Assembly election 2022
Congress vs AAP: అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ.. క్రమంగా రాజకీయ పార్టీగా మారింది. ప్రాంతీయ పార్టీగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్.. పంజాబ్‌లో అఖండ విజయం సాధించి కాంగ్రెస్‌కు షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసిన హస్తం పార్టీ.. మున్ముందు ప్రధాన ప్రతిపక్షంగానైనా దేశంలో నిలుస్తుందా అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ యత్నాల్లో ఆప్ ఆశాదీపంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ ఉనికే లేకుండా పోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సమర్థ పరిపాలన అందిస్తానంటూ ఆప్ పంజాబ్ ఓటర్లను ఆకట్టుకొందనీ, ఈ అద్భుత విజయాన్ని అభినందించాల్సిందేనని శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సత్తాను కాంగ్రెస్ కోల్పోతున్నట్లు తాజా ఎన్నికలు సూచిస్తున్నాయని వర్ధమాన సమాజాల అధ్యయన కేంద్ర పరిశోధకుడు సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. 'కాంగ్రెస్ బలహీనపడుతున్నచోట ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తోంది. ఇది కాంగ్రెస్‌కు ఆందోళనకర పరిణామం. రాబోయే గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో విజయ సాధనకు ఆప్ నడుం కడుతోంది' అని కుమార్ తెలిపారు. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ కోలుకోవాలంటే తనను తాను సమూలంగా సంస్కరించుకోవాలనీ, చిట్కా వైద్యాలతో పార్టీ పునరుజ్జీవం సాధ్యం కాదనీ స్పష్టం చేశారు. ప్రతిపక్ష శిబిరంలో కాంగ్రెస్ స్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ప్రమాదం ముంచుకొస్తోందని రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఆప్ బలం పెంచుకొంటే కాంగ్రెస్ అసంతృప్తులు ఆ పార్టీ వైపు ఆకర్షితులవుతారన్నారు. కాంగ్రెస్ మళ్లీ విజయపథంలో పురోగమించాలంటే మార్పు తప్పనిసరన్న అభిప్రాయంతో ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఏకీభవించారు.
ఇదీ చూడండి:జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఆప్!