మునుపెన్నడూ చూడని సంక్షోభం, ఎన్నికల్లో వరుస ఓటములు, అంతర్గత సవాళ్లు వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ.. 'చింతన్ శిబిర్'కు సిద్ధమైంది. తమ పనితీరుపై ఆత్మవిమర్శ చేసుకునేందుకు ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. బలమైన కమలదళాన్ని ఢీకొట్టే ముందు పార్టీని పూర్తిగా సంస్కరించాలని పార్టీలోని నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో జరగనున్న తాజా సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఏంటీ చింతన్ శిబిర్?
పార్టీలోని సమస్యలు, పరిస్థితులపై విస్తృతంగా చర్చించే వేదికే చింతన్ శిబిర్. పార్టీలోని కీలక నేతలంతా ఇందుకు హాజరవుతారు. చివరిసారిగా 2013లో చింతన్ శిబిర్‌ను నిర్వహించారు. ప్రస్తుత సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. మే 13న మొదలుకానున్న 'చింతన్ శిబిర్' భేటీలు 15వ తేదీ దాకా కొనసాగనున్నాయి.
ఎవరెవరు పాల్గొంటారు?
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పార్టీకి చెందిన 400 మంది ప్రధాన నేతలు సమావేశాల్లో పాల్గొననున్నారు.
ప్రస్తుత అజెండా ఏంటి?
సకాలంలో పార్టీ పునరుద్ధరణ, 2024 లోక్‌సభ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం, భావి పొత్తులపై వ్యూహరచన ముఖ్యాంశాలు కానున్నాయి. కేంద్ర- రాష్ట్ర సంబంధాలు, జమ్ముకశ్మీర్ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, పెట్టుబడుల ఉపసంహరణ, ఈశాన్య రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరి, సామాజిక అసమానతలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ పార్టీలతో పొత్తుల వంటి కీలక అంశాలకు సంబంధించి పార్టీ అగ్రనేతలు ఓ స్పష్టత ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పార్టీలో ఎన్నికలపై ముందుకెలా?
పార్టీని పూర్తిగా పునరుద్ధరించాలని చాలా రోజుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని జీ23 నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సభ్యత్వాల నమోదు ప్రక్రియ విస్తృతంగా చేపడుతున్నారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఇదివరకే పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది.
ఏఐసీసీ నాయకత్వంపై స్పష్టత వచ్చేనా?
అయితే, చింతన్ శిబిర్‌లో ఏఐసీసీ నాయకత్వంపై చర్చించే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌గాంధీ తిరిగి స్వీకరించాలని పలువురు నేతలు కోరుకుంటున్నా.. నాయకత్వ సమస్య ఈ వేదికపై చర్చకు రాకపోవచ్చని సమాచారం.
సార్వత్రిక ఎన్నికల వ్యూహం?
గత రెండు ఎన్నికల నుంచి కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు ఉభయ సభల్లో కలిపి వంద మంది సభ్యులు కూడా లేరు. రెండు రాష్ట్రాల్లో మాత్రమే పార్టీ అధికారంలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కాకపోతే.. మరోసారి పరాభవం తప్పదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ఏ వ్యూహంతో ముందుకెళ్తుందనేది ప్రశ్నగా మారింది. ఇటీవల ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ తయారు చేసి ప్రెజేంటేషన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఆయన దూరమైన నేపథ్యంలో తదుపరి ప్రణాళికపై పార్టీ నేతలు ఏ విధంగా ముందుకెళ్తారనేది ఆసక్తికరం.
పొత్తుల మాటేంటో?
కాంగ్రెస్ బలహీనంగా ఉండటాన్ని చూసి ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించాలని ఊవిళ్లూరుతున్నాయి. జాతీయ స్థాయిలో కూటములు కట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవడమే కాంగ్రెస్‌కు మంచిదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 'కొన్ని రాష్ట్రాల్లో టీఎంసీ, ఆప్, వైకాపా, తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. పొత్తుల విషయంలో ఈ పార్టీల ఎదుగుదలపైనా కాంగ్రెస్ దృష్టి సారించాలి' అని సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. అయితే, తెరాస, ఆమ్ ఆద్మీ పార్టీలతో పొత్తులు ఉండవని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది.
కొత్త పార్టీలతో 'యూపీఏ ప్లస్ ప్లస్'?
భాజపాను వ్యతిరేకిస్తూ ఏర్పాటయ్యే కూటమిలో కాంగ్రెస్‌దే ప్రధాన పాత్ర అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 'యూపీఏ ప్లస్ ప్లస్' పేరుతో కొత్త కూటమిని తెరపైకి తెస్తున్నాయి. 'ప్రాంతీయ పార్టీలు చాలా ముఖ్య భూమిక పోషిస్తాయి. అందరూ కలిసి పనిచేస్తే 2024 ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించవచ్చు. కాంగ్రెస్ కేంద్రంగా.. ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలి. ఇప్పటికే యూపీఏ కూటమి ఉంది. మరింత భారీ కూటమి అవసరం. యూపీఏ ప్లస్ ప్లస్ అయితే బాగుంటుంది' అని సచిన్ పైలట్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ ఆకర్షించే అవకాశం ఉంది.
సదస్సు షెడ్యూల్ ఇలా...
- పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగంతో సదస్సు ప్రారంభం
- సదస్సులో వివిధ అంశాలపై 400 మంది ప్రతినిధులు ఆరు బృందాలుగా మారి చర్చ
- రెండు రోజులపాటు ఈ చర్చలు కొనసాగాక, మూడోరోజున డిక్లరేషన్
- మూడోరోజు జరిగే సీడబ్ల్యూసీ భేటీలో డిక్లరేషన్‌పై చర్చలు
- విస్తృత చర్చల అనంతరం 'నవ సంకల్ప తీర్మానం'తో ఈ శిబిరం ముగుస్తుంది.
- ముగింపు రోజున రాహుల్‌గాంధీ ప్రసంగం
ఇదీ చదవండి:
కాంగ్రెస్ ప్రక్షాళనకు మేధోమథనం.. ఉదయ్పుర్లో చింతన్ శివిర్
పార్టీ చాలా చేసింది.. రుణం తీర్చుకునే సమయమిదే: సోనియా