తెలంగాణ

telangana

ETV Bharat / bharat

4 రోజుల్లో 3 భేటీలు.. 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్​కు ఓకే.. కానీ...

Congress Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​తో నాలుగు రోజుల్లోనే మూడోసారి భేటీ అయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. అయితే.. పార్టీలో పీకే చేరతారా, ఆయన పాత్ర ఎలా ఉండబోతున్నది తేలేందుకు మరో వారం రోజులు పట్టొచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

sonia meets Prashant Kishor
4 రోజుల్లో 3 భేటీలు.. 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్​కు ఓకే.. కానీ...

By

Published : Apr 19, 2022, 3:01 PM IST

  • ఉత్తర్​ ప్రదేశ్​, బిహార్, ఒడిశాలో కాంగ్రెస్​ ఒంటరిగా పోటీకి దిగాలి.
  • తమిళనాడు, బంగాల్, మహారాష్ట్రలో కూటములు ఏర్పాటు చేయాలి.
  • దేశంలోని 370 నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.

Congress Prashant Kishor: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రూపొందించిన రోడ్​మ్యాప్​లోని ముఖ్యాంశాలివి. వీటితోపాటు మరికొన్ని కీలక సూచనలు చేస్తూ పీకే సమర్పించిన నివేదికపై కాంగ్రెస్​ అధిష్ఠానం ఆయనతో విస్తృత చర్చలు జరుపుతోంది. మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు కమల్​నాథ్​, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, అంబికా సోని, రణ్​దీప్​ సుర్జేవాలా.. ప్రశాంత్​తో దిల్లీలో మరోసారి భేటీ అయ్యారు.

గత నాలుగు రోజుల్లో పీకే-సోనియా భేటీ కావడం ఇది మూడోసారి. ఏప్రిల్​ 16న తొలి సమావేశం జరిగింది. ఏప్రిల్​ 18న రెండోది. ఎన్నికల వ్యూహకర్త బాధ్యతలకే పరిమితం కాకుండా.. ప్రశాంత్ కిశోర్ నేరుగా కాంగ్రెస్​ పార్టీలో చేరి, క్రియాశీలకంగా వ్యవహరిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీలు జరగడం విశేషం. అయితే.. పార్టీలో పీకే చేరిక, ఆయన చేపట్టనున్న బాధ్యతలపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు వేణుగోపాల్.

అప్పుడలా.. ఇప్పుడిలా..: కాంగ్రెస్​లో పీకే చేరికపై ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఆ పార్టీకి ప్రశాంత్ దూరంగా జరిగినట్టు కనిపించింది. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం తర్వాత మరోమారు పీకేతో చర్చలు ప్రారంభించింది కాంగ్రెస్. భాజపా వ్యతిరేక రాజకీయమే ప్రధాన అజెండాగా తృణమూల్ కాంగ్రెస్, ఆమ్​ఆద్మీ పార్టీ జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సోనియా సేన అప్రమత్తమైంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్​ శాసనసభ ఎన్నికలు, 2024 లోక్​సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఖరారు చేసేందుకు పీకే సాయం తీసుకుంటోంది. ఇప్పటికే మూడుసార్లు ఆయనతో భేటీ అయిన కాంగ్రెస్​ అధినాయకత్వం.. రానున్న రోజుల్లో మరో రెండు సార్లు సమావేశం కానుందని తెలిసింది. మరోవైపు.. 2024 ఎన్నికల కోసం వేర్వేరు రాష్ట్రాల్లో పొత్తులపై పీకే ప్రతిపాదనలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంగీకరించినట్లు సమాచారం.

ఒక్కసారిగా మార్చేద్దామా?: పొత్తుల వ్యవహారంలో పీకే ప్రతిపాదనల పట్ల రాహుల్​ సానుకూలంగా ఉన్నా.. ఇతర సూచనల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఎన్నికల రోడ్​మ్యాప్​లోని అంశాలను ఆయా నాయకులంతా క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం చిదంబరం, జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, రణ్​దీప్​ సుర్జేవాలాతో పీకే ప్రతిపాదనలపై విస్తృతంగా సమీక్షించారు. మంగళవారం కూడా సీనియర్ నేతలు ఇదే తరహా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్

కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక సంస్కరణలు, కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తాన్ని పునర్​వ్యవస్థీకరించడంపై పీకే ప్రతిపాదనల పట్ల సీనియర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేట్ సంస్థల్లో విప్లవాత్మక సంస్కరణలు, పునర్​వ్యవస్థీకరణలు సాధ్యమవుతాయి కానీ.. 137 ఏళ్ల నాటి పార్టీ పద్ధతుల్ని రాత్రికి రాత్రే మార్చేయడం కుదరదన్నది వారి వాదన. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని, క్రమంగా మార్పులు తీసుకురావాలన్నదే సీనియర్ల ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్​లో పీకే చేరికపైనా ఏకాభిప్రాయం లేదని సమాచారం. ప్రశాంత్ పార్టీలోకి వస్తే తమ ప్రాబల్యం తగ్గిపోతుందని కొందరు భయపడుతున్నట్లు తెలిసింది. అందుకే.. పీకే రోడ్​మ్యాప్​ సహా పార్టీలో ఆయన్ను చేర్చుకోవడంపై విస్తృతంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details