దేశంలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్. జులై 7 నుంచి 17వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. వివిధ రాష్ట్రాల ఏఐసీసీ ఇంఛార్జులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
" పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఏఐసీసీ బృందం.. అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆకాశాన్నంటుతున్న పప్పు దినుసులు, వంట నూనెల ధరలు సహా ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చించింది. మే 2 నుంచి ప్రభుత్వం 29 సార్లు ఇంధన ధరలు పెంచింది. 150కిపైగా నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. పెట్రోల్, డీజీల్‌పై విధించిన ఎక్సైజ్ సుంకంతో భాజపా ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల్లో రూ.22 లక్షల కోట్లు ఆర్జించింది. గడిచిన ఆరునెలల్లో వంట నునెల ధరలు రెండింతలయ్యాయి. టోకు ద్రవ్యోల్బణం 2021, మేలో 12.94శాతానికి చేరింది. ఇది 11 ఏళ్లలోనే అత్యధికం."