దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది కాంగ్రెస్. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జులు, పీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.
" 2021, ఆగస్టు 14, 15 తేదీల్లో అన్ని జిల్లాలో స్వతంత్ర సేనాని, షాహీద్ సమ్మాన్ దివస్‌ను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆగస్టు 14న సాయంత్రం స్వతంత్ర సమరయోధులు, వారి కుటుంబాలు, వీరుల కుటుంబాలను గౌరవించుకోనున్నాం. ఈ కార్యక్రమం స్వతంత్ర సంగ్రామం జరిగిన లేదా స్వతంత్ర సమరయోధులకు చెందిన ప్రదేశాల్లో నిర్వహిస్తాం. ఆగస్టు 15న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వతంత్ర మార్చ్ చేపట్టనున్నాం. మండల, జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఈ మార్చ్‌ను నిర్వహిస్తాయి. అలాగే.. స్వతంత్ర సంగ్రామంలోని సంఘటనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార కార్యక్రమం ఉంటుంది. పీసీసీలు ఆయా రాష్ట్రాల్లోని స్వాతంత్య్ర సంఘటనలను చూపించేలా రెండు నిమిషాల వీడియోలు సిద్ధం చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయనున్నారు. "