విపక్షాల కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో తానేప్పుడు చెప్పలేదన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఈ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్న.. అసలు ప్రశ్నే కాదన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు విభజన శక్తులపై పోరాడేందుకు విపక్షాలన్ని ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎమ్‌కే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్.. 70వ పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరైన ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారని బీజేపీపై విరుచుకుపడ్డారు. అయినా బీజేపీ తన రాజకీయ లబ్ది కోసమే ప్రయత్నిస్తుందన్నారు. ఈ తరుణంలో దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
"విభజన శక్తులపై పోరాడేందుకు భావ సారుప్యత కలిగిన పార్టీలన్ని కలిసి రావాలి. ఎవరు కూటమికి నాయకత్వం వహిస్తారో, ఎవరు ప్రధాని అవుతారో నేనెప్పుడూ చెప్పలేదు. దానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందో, లేదో అని చెప్పడం లేదు. అది ప్రశ్నే కాదు. అందరం కలిసికట్టుగా పోరాడాలి అనుకుంటున్నాం. అదే మా కోరిక. అందుకే సెక్యులరిజం, స్వేచ్ఛ పేరుతో, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఎన్నోసార్లు త్యాగాలు చేశాం."అని ఖర్గే అన్నారు.