భారత్లో జరిగే ఎన్నికలను ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ప్రభావితం(facebook influence on elections) చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆరోపించింది కాంగ్రెస్. ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(joint parliamentary committee) ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది.
'ఫేస్బుక్ తనను తాను ఫేక్బుక్గా(Facebook news) దిగజార్చుకుంది' అని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా. భారత్లో తమ ఫ్లాట్ఫామ్ వేదికగా చేస్తున్న విద్వేషపూరిత ప్రకటనలను అడ్డుకోవటంలో ఫేస్బుక్ విఫలమైందన్న పలు అంతర్జాతీయ నివేదికలను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"అధికార భాజపాకు ఫేస్బుక్ భాగస్వామ్య వ్యవస్థగా వ్యవహరిస్తూ ఆ పార్టీ అజెండాను ప్రచారం చేస్తోంది. లక్షల సంఖ్యలో పోస్టులతో కూడిన నకిలీ ఖాతాలు ఉన్నట్లు ఫేస్బుక్ అంతర్గత నివేదికలు చెబుతున్నాయి. కానీ, ఇప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మన ఎన్నికలను ఫేస్బుక్ ప్రభావితం చేస్తోందన్న అంశంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నకిలీ పోస్టులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువను తగ్గిస్తోంది. ఫేస్బుక్ వ్యవస్థలోకి భాజపా కార్యకర్తలు చొరబడి దాని పనితీరునే మార్చేస్తున్నారు. నకిలీ పోస్టులు, చిత్రాలు, కథనాల ద్వారా ఒక నిర్దిష్ట భావజాలాన్ని ప్రోత్సహించడానికి ఫేస్బుక్కు ఏ హక్కు ఉంది? కేవలం 0.2 శాతం విద్వేషపూరిత పోస్టులను తొలగించారనేది ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హిందీ, బెంగలీలో చేసే పోస్టులను ఫిల్టర్ చేసే వ్యవస్థే లేదు."