Rajasthan Congress Meeting : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు.. నేతలంతా కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వ్యూహంపై గురువారం దిల్లీలో సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ఇంఛార్జ్ సుఖ్‌జిందర్ రంద్వా, రాజస్థాన్ ముఖ్యమంత్రి సహా 29 మంది నేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశం తర్వాత చెప్పారు.
Ashok Gehlot VS Sachin Pilot : సీఎం అశోక్ గెహ్లోత్, మాజీ మంత్రి సచిన్ పైలట్ మధ్య రాజీ ఫార్ములా ఏమైనా కుదిరిందా అన్న ప్రశ్నకు.. ఆయన జవాబు దాట వేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే ఉద్దేశంలేదని వేణుగోపాల్ స్పష్టంచేశారు. గెలిచే సత్తా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sachin Pilot Congress : సమావేశం అనతంరం మాట్లాడిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్.. రాజస్థాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలు, శాసనసభ్యులు కలిసి పనిచేస్తారని అన్నారు. రాష్ట్రంలో గత బీజేపీ ప్రభుత్వం అవినీతి, పేపర్ లీకేజీలు, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్కరణ వంటి విషయాలను లేవనెత్తినట్లు పైలట్ తెలిపారు. తాను యువత గురించి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై పార్టీ నాయకత్వం సానుకూలంగా స్పందించిందని.. వాటిపై మార్గదర్శకాలు ఇచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
'రాజస్థాన్‌లో అవినీతిని ఎన్నికల అజెండాగా మా పార్టీ ఎంచుకుంటుంది. గత బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఓపెన్ మైండ్‌తో చర్చించాము. పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి పనిచేస్తారు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలిచింది. ఇది ఈసారి పునరావృతం అవుతుంది' అని సచిన్ పైలట్ అన్నారు.