Congress rally in Jaipur: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హిందుత్వవాదులను గద్దె దింపి.. హిందువులకు అధికారం కట్టబెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. దేశంలో ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని, నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు అల్లాడుతున్నా.. అధికారం కోసం పాకులాడేవారే హిందుత్వవాదులంటూ భాజపా నేతలనుద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రధాని మోదీ.. తన సన్నిహితులైన నలుగురు పారిశ్రామిక వేత్తలతో ఈ ఏడేళ్లలో దేశాన్ని నాశనం చేశారని విమర్శించారు. భారత దేశం హిందువులది తప్ప హిందుత్వవాదులది కాదని అన్నారు. దేశ రాజకీయాల్లో హిందువులకు.. హిందుత్వవాదికి మధ్య తీవ్ర పోటీ ఉందన్న రాహుల్.. మహాత్మా గాంధీ హిందువని, గాడ్సే హిందుత్వవాదని తెలిపారు. తాను హిందువునని తెలిపిన రాహుల్.. హిందుత్వవాదిని కాదని స్పష్టం చేశారు.
ధరల పెరుగుదలను నిరసిస్తూ జైపుర్ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్నారు రాహుల్.
"హిందుత్వవాదులకు అధికారమే ముఖ్యం. 2014 నుంచి వారే అధికారంలో ఉన్నారు. ఆ హిందుత్వవాదులను అధికారం నుంచి దింపేసి.. హిందువులను తీసుకురావాలి. హిందుత్వవాదులు అధికారం కోసమే తమ జీవితాంతం ఆరాటపడతారు. వారికి అధికారం కన్నా ఏదీ ఎక్కువ కాదు. దాని కోసం ఏదైనా చేస్తారు. వారు సత్తాగ్రహ్ దారిని అనుసరిస్తారు. సత్యాగ్రహాన్ని కాదు. ఈ దేశం హిందువులది, హిందుత్వవాదులది కాదు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
దేశం మొత్తం ఐదుగురు కార్పొరేట్ల చేతిలో బందీ అయిపోయిందని, వారే కేంద్రాన్ని నడిపిస్తున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దేశం మొత్తం ఓ సంస్థ చేతిలో ఉండిపోయిందని పరోక్షంగా ఆర్ఎస్ఎస్ విమర్శించిన రాహుల్.. ప్రభుత్వాలు కూల్చడంపైనే మోదీ శ్రద్ధ పెట్టారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నంత సేపు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చప్పట్లు కొడుతూ అభినందించారు. అంతకుముందు.. సోనియా చేయి పట్టుకుని రాహుల్‌గాంధీ.. సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు.