Sonia Gandhi Corona: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. తేలికపాటి జ్వరం, స్వల్పలక్షణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారని, వైద్యం అందిస్తున్నారని స్పష్టం చేశారు. గత వారం రోజులుగా సోనియా అనేక మంది నేతలు, కార్యకర్తల్ని కలుస్తున్నారని.. వారిలో కొందరికి కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు వివరించారు. తాము ముందుగా చెప్పినట్టు.. ఈనెల 8న నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఎదుట ఆమె హాజరవుతారని చెప్పారు. "ఆమె త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఆమెకు మళ్లీ పరీక్ష చేయిస్తాం. ఈడీ విచారణకు హాజరయ్యే ప్రణాళిక ఇప్పటికైతే యథాతథంగానే ఉంది" అని స్పష్టం చేశారు సుర్జేవాలా.
ఇదే కేసులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని.. గురువారం విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది ఈడీ. అయితే.. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇతర కార్యక్రమాలు ఉన్నందున రావడం సాధ్యం కాదని రాహుల్.. సమాచారం పంపారు. విచారణలో పాల్గొనేందుకు మరింత సమయం కావాలని ఈడీని కోరినట్లు తెలుస్తోంది.