కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తొలిరోజే మల్లికార్జున ఖర్గే.. పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చట్టారు. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 47 మంది సీనియర్ నేతలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా, మాజీ మంత్రులు ఏకే ఆంటోనీ, అజయ్‌మాకెన్, అంబికా సోని, ఆనంద్‌శర్మ, జైరాం రమేష్, పి.చిదంబరం, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్‌సింగ్, సల్మాన్‌ఖుర్షీద్, రాజీవ్‌శుక్లా ఉన్నారు. మాజీ సీడబ్ల్యూసీ సభ్యులు, గ్రూప్-23 నేతలకు స్టీరింగ్ కమిటీలో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి టి.సుబ్బిరామిరెడ్డికి అవకాశం దక్కింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్‌కు కూడా స్టీరింగ్ కమిటీలో చోటు దక్కింది. సంప్రదాయం ప్రకారం సీడబ్ల్యూసీ సభ్యులు కొత్త అధ్యక్షునికి రాజీనామా సమర్పించారు.
అంతకుముందు ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి బాధ్యతలను స్వీకరించారు ఖర్గే. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచినట్లు ధ్రువపత్రాన్ని ఖర్గేకు అందజేశారు పార్టీ ఎన్నికల కమిటీ ఇంఛార్జ్ మధుసూధన్ మిస్త్రీ. ఈ సందర్భంగా మాట్లాడిన ఖర్గే.. ఇది తనకు భావోద్వేగంతో కూడిన క్షణమని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తను పార్టీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. దేశంలో నూతన ఉత్సాహాన్ని నింపుతోందని అన్నారు. 'ప్రస్తుతం ఉన్న విద్వేషాన్ని, అబద్ధపు సంకెళ్లను కాంగ్రెస్ పార్టీ ఛేదిస్తుంది. 50ఏళ్ల లోపు నేతలకు 50 శాతం సీట్లు ఇవ్వాలన్న ఉదయ్‌పుర్ డిక్లరేషన్‌లోని ప్రతిపాదనను అమలు చేస్తాం' అని ఖర్గే పేర్కొన్నారు.