Congress President Elections: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేతో బహిరంగ ఎన్నికల ముఖాముఖికి తాను సిద్ధమని తిరువనంతపురం ఎంపీ, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశి థరూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల హృదయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లుకు సమర్ధవంతమైన నాయకత్వంతో పాటు సంస్థాగత సంస్కరణల కలయికే పరిష్కారమని ఓ ఇంటర్వ్యూలో థరూర్ పేర్కొన్నారు.
"ప్రపంచస్థాయి సంస్థలకు నాయకత్వం వహించిన నాకు మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 77 కార్యాలయాలలో 800 మంది సిబ్బందితో కూడిన యూఎన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్కు సెక్రటరీ జనరల్‌గా సమర్థంగా సేవలు అందించాను. ఆ సంస్థ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాను. బడ్జెట్‌ను తగ్గించాను. 2017లో స్థాపించిన ఆల్ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌కు వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్నాను. కేవలం ఐదేళ్లలో 20 రాష్ట్రాల నుంచి 10,000 మంది సభ్యులు అందులో ఉన్నారు. నామినేషన్ తేదీకి ఎన్నికల తేదీ మధ్య, దాదాపు రెండున్నర వారాల సమయమే ఉంది కాబట్టి 9,000 పీసీసీ ప్రతినిధులందరినీ సంప్రదించడం చాలా కష్టం. కాబట్టి ముఖాముఖి చర్చ పెడితే ఎక్కువమందికి ఒకేసారి సందేశం ఇవ్వొచ్చు."
--శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి
"కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులందరనీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. పార్టీని గొప్పగా నడిపించిన రికార్డు గాంధీలకు ఉంది. పార్టీ కోసం వారు సాధించిన దాన్ని ఎప్పటికీ మనం మరచిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల హృదయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మనంలో చాలా మంది రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటారని భావించాం. కానీ అది జరగలేదు. ముఖ్యంగా సోనియా, రాహుల్, ప్రియాంక ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదు" అని శశిథరూర్ చెప్పారు.
మరోవైపు, ఆదివారం నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన థరూర్.. అధ్యక్ష ఎన్నికలు అంటే యుద్ధం కాదని పేర్కొన్నారు. పోటీలో ఉన్న తాము శత్రువులం కాదని స్పష్టం చేశారు. 'ఖర్గే నాకన్నా సీనియర్ కాబట్టి.. పోటీ నుంచి వైదొలగాలని నాకు కొందరు సూచిస్తున్నారు. కానీ నేను ఎందుకు పోటీ పడకూడదు? ఖర్గే అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఇది పార్టీ భవిష్యత్ కోసం జరుగుతున్న ఎన్నిక. పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై ఇద్దరికీ వేర్వేరు ఆలోచనలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో ఖర్గే కూడా భాగమే. గాంధీ కుటుంబం కాకుండా పార్టీలో ఉన్న అత్యుత్తమ ముగ్గురు నేతల్లో ఆయన ఒకరు. కానీ, అలాంటి నేత పార్టీలో మార్పు తీసుకురాలేరు. ప్రస్తుత వ్యవస్థనే ఆయన కొనసాగిస్తారు. పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్న మార్పును నేను తీసుకొస్తా' అని థరూర్ వ్యాఖ్యానించారు.
'పార్టీని బలోపేతం చేసేందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులోకి'
కాగా, తాను ఎవరినీ ఎదిరించేందుకు కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగలేదని, పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రమే పోటీలోకి వచ్చానని ఖర్గే తెలిపారు. సీనియర్లు, యువనేతల కోరిక మేరకు తాను ఎన్నికల్లో ప్రవేశించానని ఖర్గే చెప్పారు.'ఒకే వ్యక్తి, ఒకే పదవి' అనే పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే తాను నామినేషన్ దాఖలు చేసిన రోజే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశానని తెలిపారు.
"దేశంలో నిరుద్యోగ శాతం, ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ధనవంతులు, పేదల మధ్య అంతరం పెరుగుతోంది. ముఖ్యంగా భాజపా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. గాంధీ కుటుంబం తనకు మద్దతు ఇస్తోందని వదంతులు వస్తున్నాయి. అవి నిజం కాదు. అయితే ఎన్నికల తర్వాత ఏ నిర్ణయమైనా నాయకులంతా సమష్టిగా తీసుకుంటాం."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి