తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఖర్గే X థరూర్​.. సోమవారమే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. గెలుపెవరిది? - కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలకు పోటీ

137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ మధ్య పోటీ నెలకొనగా 9 వేల మందికిపైగా పీసీసీ ప్రతినిధులు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.

congress president election
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

By

Published : Oct 16, 2022, 3:51 PM IST

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్‌ జరుగుతుండటం ఇది ఆరోసారి. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక బరిలోకి లేకపోవడం వల్ల 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ మధ్య పోటీ నెలకొంది.

9 వేల మందికిపైగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ, పీసీసీ ప్రతినిధులు సోమవారం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేయనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో, భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో కూడా పోలింగ్ జరగనుంది. భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా పలువురు నేతలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది. తెలంగాణకు రిటర్నింగ్ అధికారిగా కేరళ నేత రాజమోహన్ ఉన్నితన్, దిల్లీకి రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ ఇప్పటికే వివిధ రాష్ట్రాల రాజధానుల్లో పర్యటించారు. పీసీసీ ప్రతినిధుల ఆదరణ చూరగొనే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున ఖర్గే ముందంజలో ఉన్నారు. ఎక్కువ మంది సీనియర్లు ఆయనకే మద్దతిస్తున్నారు. ఈ విషయంలో థరూర్‌ ఆరోపణలు గుప్పించినా.. తాము తటస్థంగా ఉన్నామని ఎవరి పక్షాన లేమని గాంధీ కుటుంబం ఇప్పటికే స్పష్టం చేసింది.

టిక్ పెట్టేటట్లు మార్చండి..
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీరియల్ నంబర్లు ఆధారంగా కాకుండా తమ నచ్చిన పేరుకు ఎదురుగా టిక్ పెట్టేటట్లు ఎన్నికల నిబంధనను సడలించాలని కోరారు శశిథరూర్ మద్దతుదారులు. అంతకుముందు మల్లిఖార్జున ఖర్గేకు సీరియల్ నంబరు 1 రాగా.. శశిథరూర్​కు 2 నంబరు వచ్చింది. దీనిని థరూర్ వర్గీయులు వ్యతిరేకించారు. బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నంబర్ 1లో ఖర్గే.. సీరియల్ నంబర్ 2లో శశిథరూర్ అని ఉండడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతారని తెలిపారు.

గెలుపు ఎవరిదంటే?
తాజా ఎన్నికల్లో గెలుపు ఎవరి వరిస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. హైకమాండ్ మద్దతు ఉందని భావిస్తున్న మల్లిఖార్జున ఖర్గేనే.. విజయం వరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి నుంచి పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు ఖర్గే. ఆయన వివాదరహితుడు కూడా. అలాగే సోనియా అప్పగించిన కార్యక్రమాలను చక్కగా నిర్వర్తిస్తారనే పేరు కూడా ఉంది. దళిత వర్గానికి చెందిన నేత కావడం కొంత ప్లస్ పాయింట్. పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, అశోక్ గహ్లోత్​, మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ వంటి నేతల మద్దతు ఉంది.

పాపులారిటీ ఉన్నా..
ఇక అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశి థరూర్.. కాంగ్రెస్​లో ఉన్న తెలివైన నాయకుల్లో ఒకరు. సమయోచితంగా ఆలోచిస్తూ మాట్లాడే వ్యక్తి. పట్టణవాసులు, చదువుకున్న వారిలో శశిథరూర్​కు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న అతికొద్దిమంది కాంగ్రెస్ నాయకుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ఉన్నారు. దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడం ఆయన మైనస్ పాయింట్. అనేక మంది కాంగ్రెస్ నేతల మాదిరిగా.. ఉత్తరాది రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం శశిథరూర్​కు కష్టమే కావొచ్చు. ఇవన్నీ పక్కనబెడితే.. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన జీ23 బృందంలో శశిథరూర్ సైతం ఉన్నారు. ఇది ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:'50 పెట్రోల్​ బాంబులు పేల్చి వారిని చంపేయాలి!'.. ఆడియో లీక్​ కేసులో కార్పొరేటర్​ అరెస్ట్​

వేప చెట్టు నుంచి పాలు.. ఆమె మహిమేనట.. తాగితే రోగాలు మాయం అంటూ...

ABOUT THE AUTHOR

...view details