కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్. పోటీ నుంచి తప్పుకుంటునట్లు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన నామినేషన్ పత్రాలపై దిగ్విజయ్ సంతకం చేశారు. దీంతో ఖర్గే, శశిథరూర్ మధ్యే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ జరగనుంది. మరోవైపు, మల్లిఖార్జున ఖర్గే అభ్యర్థిత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు.
'నా జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశాను. ఇకపై కూడా పనిచేస్తా. దళితులు, గిరిజనులు, పేదల పక్షాన నిలబడతా. మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోరాడతా. ఇందులో రాజీపడే ప్రశక్తే లేదు. పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటా. మల్లిఖార్జున ఖర్గే నా సీనియర్. నేను ఆయన నివాసానికి వెళ్లి అధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయమని కోరా. తాను దాఖలు చేయబోనని చెప్పారు. ఆ తర్వాత ఆయనే అభ్యర్థి అని పత్రికల ద్వారా తెలుసుకున్నాను.
--కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్
శశి థరూర్ నామినేషన్..
పార్టీ అధ్యక్ష పదవికికాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవికి ఝూర్ఖండ్ కాంగ్రెస్ నేత కేఎన్ త్రిపాఠి.. ఏఐసీసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.