కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ కాస్త.. ద్విముఖ పోరుగా మారింది. అధ్యక్ష ఎన్నికల కోసం ముగ్గురు నేతలు నామినేషన్లు దాఖలు చేయగా.. కేఎన్ త్రిపాఠి నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. అభ్యర్థుల నామపత్రాలు పరిశీలించిన మిస్త్రీ.. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మాత్రమే బరిలో ఉన్నారని స్పష్టం చేశారు.
"మొత్తంగా 20 దరఖాస్తులు వచ్చాయి. అందులో నాలుగు తిరస్కరణకు గురయ్యాయి. ఖర్గే 14 దరఖాస్తులు, థరూర్ ఐదు, త్రిపాఠి ఒక దరఖాస్తు సమర్పించారు. త్రిపాఠిని బలపరిచిన వ్యక్తి సంతకం సరిపోలలేదు. బలపరిచిన మరో వ్యక్తి సంతకం పునరావృతమైంది. ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులు- ఖర్గే, థరూర్- బరిలో ఉన్నారు" అని మిస్త్రీ తెలిపారు. తిరస్కరణకు గురైన మరో మూడు దరఖాస్తులు ఎవరివో చెప్పేందుకు మిస్త్రీ నిరాకరించారు.
కాగా, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు సమయం ఉంది. ఆ తర్వాత బరిలో ఉండేది ఎవరో తేలిపోనుంది. అక్టోబర్ 8న సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు. థరూర్, ఖర్గేలలో ఎవరు నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 9వేలకు పైగా కాంగ్రెస్ సభ్యులు ఎన్నికల్లో ఓటేస్తారు. అక్టోబర్ 19న కౌంటింగ్ ఉంటుంది. అదేరోజు విజేతను ప్రకటిస్తారు. మరోవైపు, మిస్త్రీ ప్రకటన తర్వాత ట్వీట్ చేసిన థరూర్.. స్నేహపూర్వక పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రజాస్వామ్యయుత ప్రక్రియ పార్టీకి, నేతలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు.
ఖర్గే రాజీనామా
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపారు. ఒక వ్యక్తికి ఒక పదవి అని ఉదయ్‌పుర్ చింతన్ శిబిర్‌లో చేసిన తీర్మానానికి కట్టుబడి రాజీనామా చేసినట్లు తెలిపారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగారు. ఆయనకు మద్దతుగా దిగ్విజయ్‌సింగ్ పోటీ నుంచి తప్పుకోగా.. గాంధీ కుటుంబంమద్దతుతో పోటీచేస్తారని ప్రచారం జరిగిన రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కూడా ఖర్గే పేరును ప్రతిపాదించారు. అంతేకాకుండా ఖర్గే పేరును 30మంది పార్టీ సీనియర్లు ప్రతిపాదించారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి గ్రూప్-23కి చెందిన పలువురు నేతలు కూడా హాజరయ్యారు.