తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో డిగ్గీరాజా.. థరూర్​తో కుస్తీ.. గెలిచే ఛాన్స్ ఆయనకే! - కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు

Congress president election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. దీంతో శశిథరూర్​ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురి బలాబలాలు ఏంటి? ఎవరికి గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయనే విషయాన్ని గమనిస్తే...

congress-president-election
congress-president-election

By

Published : Sep 29, 2022, 1:57 PM IST

Updated : Sep 29, 2022, 2:51 PM IST

Congress president election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారనే స్పష్టత వచ్చింది. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ బరిలో ఉండటం ఖాయం కాగా.. ఆయనతో మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. నామినేషన్ పేపర్లను తీసుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. గాంధీ కుటుంబం మద్దతు ఉన్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీలో ఉంటారని విస్తృత ప్రచారం జరగ్గా.. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో గహ్లోత్ అవకాశాలు దూరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తదుపరి అభ్యర్థిగా ఎవరుంటారనే విషయంపై చర్చ జరిగింది. పార్టీ నాయకత్వం ఆదేశాల ప్రకారమే పోటీ చేస్తున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. దీనికి తానే బాధ్యుడిని అని పేర్కొన్నారు దిగ్విజయ్.

పార్టీ అధ్యక్ష పదవికి అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, కమల్​నాథ్, అంబికా సోని, పవన్ బన్సల్ సైతం పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, వీరిలో చాలా వరకు పోటీలో లేమని స్పష్టం చేశారు. కాగా, గహ్లోత్ సైతం పూర్తిగా పోటీకి దూరమైనట్లు కాదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు దిగ్విజయ్, శశిథరూర్ మధ్య పోటీ ఖాయమైన నేపథ్యంలో ఇరువురిలో ఎవరికి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందనే విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. హిందీ, నాన్ హిందీ అంశమే కాకుండా.. రాజకీయానుభవం, పార్టీపై పట్టు, పాపులారిటీ వంటి అనేక విషయాలు వీరిద్దరి గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి బలాబలాలు పరిశీలిస్తే...

సంస్థాగతంగా పట్టు..
దిగ్విజయ్​కు కాంగ్రెస్​పై గట్టిపట్టు ఉంది. సంస్థాగతంగా పార్టీని నడిపించారు. బూత్ స్థాయి కార్యకర్తలతో సమన్వయం చేసుకోవడంలో దిట్ట. తెరవెనక ఉండి మంతనాలు ఎలా జరపాలో తెలిసిన నేత. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు వివిధ హోదాల్లో, అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. చాలా రాష్ట్రాల నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి, హిందీ రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోనూ చక్రం తిప్పడం కష్టమేమీ కాకపోవచ్చు. 75ఏళ్ల దిగ్విజయ్​.. భాజపా అంటే చాలు విరుచుకుపడతారు. భాజపా, ఆర్ఎస్​ఎస్​ హిందుత్వ భావజాలంపై ఎప్పటికప్పుడు కత్తులు దూస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా కాషాయదళంపై విమర్శలు ఎక్కుపెడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని, భాజపాను ఆయన సమర్థంగా ఎదుర్కోగలరని కాంగ్రెస్​ నేతలు భావిస్తున్నారు.

పాపులారిటీ ఉన్నా...
ఇక బరిలో ఉన్న మరో నేత శశిథరూర్.. కాంగ్రెస్​లో ఉన్న తెలివైన నాయకుల్లో ఒకరు. సమయోచితంగా ఆలోచిస్తూ మాట్లాడే వ్యక్తి. పట్టణవాసులు, చదువుకున్న వారిలో శశిథరూర్​కు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న అతికొద్దిమంది కాంగ్రెస్ నాయకుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ఉన్నారు. దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడం ఆయన మైనస్ పాయింట్. అనేక మంది కాంగ్రెస్ నేతల మాదిరిగా.. ఉత్తరాది రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం శశిథరూర్​కు కష్టమే కావొచ్చు. ఇవన్నీ పక్కనబెడితే.. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన జీ23 బృందంలో శశిథరూర్ సైతం ఉన్నారు. ఇది ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

పోటీ కాదు..
కాగా, నామపత్రాలు స్వీకరించిన అనంతరం దిగ్విజయ్ సింగ్.. శశిథరూర్​ను కలిశారు. అధ్యక్ష పదవికి దిగ్విజయ్ పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు థరూర్ తెలిపారు. ఇది ఇద్దరి మధ్య పోరాటంగా కాకుండా.. స్నేహపూర్వక పోటీగానే ఉండాలని ఇరువురూ అంగీకరించుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లేనని థరూర్ ట్వీట్ చేశారు.

థరూర్ ట్విట్టర్​లో పోస్ట్ చేసిన చిత్రం

శుక్రవారమే చివరి తేదీ..
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారమే చివరి తేదీ. అక్టోబర్‌ 1న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. అక్టోబర్‌ 17న ఓటింగ్‌ నిర్వహిస్తారు. రెండు రోజుల తర్వాత(అక్టోబర్ 19న) ఫలితాలు ప్రకటిస్తారు.

Last Updated : Sep 29, 2022, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details