తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు'.. గహ్లోత్ ప్రకటన.. సోనియాకు క్షమాపణ - congress party leader

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో తాను లేనని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు. దిల్లీలో సోనియా గాంధీని కలిసిన ఆయన.. ఆమెకు క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు. రాజస్థాన్ పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు. మరోవైపు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్​తోనూ సోనియా భేటీ కానున్నారు.

Ashok Gehlot says he will not contest
Ashok Gehlot says he will not contest

By

Published : Sep 29, 2022, 3:00 PM IST

Updated : Sep 29, 2022, 3:31 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వెల్లడించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో దిల్లీలో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఎప్పుడూ క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్​ సైనికుడిగానే పనిచేశానని గహ్లోత్ పేర్కొన్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఘటనలు తమను షాక్​కు గురి చేశాయని చెప్పారు. 'నేను ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకోవడం వల్లే ఇదంతా జరిగిందని సోనియాకు వివరించాను. దీనిపై ఆమెకు క్షమాపణ చెప్పా' అని గహ్లోత్ తెలిపారు.

"కొచ్చిలో రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలని కోరా. ఆయన అందుకు ఒప్పుకోలేదు. నేను పోటీ చేస్తానని ఆయనతో చెప్పా. కానీ ఈ పరిస్థితుల్లో నేను పోటీలో ఉండకూడదని భావిస్తున్నా. నైతిక బాధ్యతతో బరిలో నుంచి తప్పుకుంటున్నా. రాజస్థాన్​లో జరిగిన పరిణామాలపై చింతిస్తున్నా. దీనిపై సోనియాకు క్షమాపణ చెప్పా."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అన్న ప్రశ్నకు స్పందించిన గహ్లోత్.. ఈ విషయాన్ని తాను నిర్ణయించనని, అంతా సోనియా గాంధీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్ సీఎల్పీ భేటీలో ఎలాంటి తీర్మానం ఆమోదం పొందకపోవడంపై విచారం వ్యక్తం చేశారు గహ్లోత్. 'ఏకవాక్య తీర్మానం ఆమోదించడం మా సంప్రదాయం. దురదృష్టవశాత్తు ఆ తీర్మానం ఆమోదించే పరిస్థితి రాలేదు. సీఎం అయ్యుండి కూడా తీర్మానం ఆమోదింపజేయలేకపోయా' అని గహ్లోత్ తెలిపారు.

కొద్దిరోజుల క్రితం వరకు కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ముందున్నారు గహ్లోత్. గాంధీ కుటుంబం మద్దతుతో ఆయన బరిలోకి దిగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే రాజస్థాన్​లో జరిగిన పరిణామాలు పరిస్థితులను తలకిందులు చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఆమోదించుకున్న నిబంధనల ప్రకారం.. పార్టీలో ఒక వ్యక్తి ఒకే పదవిలో ఉండాలి. ఈ నేపథ్యంలో గహ్లోత్ పార్టీ అధ్యక్షుడైతే.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. రాజస్థాన్ తదుపరి సీఎంగా ప్రస్తుత ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్​కు అవకాశాలు ఉండగా.. ఆయనకు పదవి అప్పగించడం గహ్లోత్​కు ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. పైలట్​ను కాదని ఇతరులను తన వారసుడిని చేయాలని ఆయన అనుకున్నట్లు తెలిసింది. దీంతో గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు.. పైలట్​కు వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించారు. ఫలితంగా రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీనిపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉందన్న పరిణామాల మధ్యే.. సోనియా, గహ్లోత్ మధ్య తాజా భేటీ జరిగింది. కాగా, సచిన్ పైలట్ సైతం గురువారం సోనియాతో భేటీ కానున్నారు.

Last Updated : Sep 29, 2022, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details