Congress President election : దేశంలో 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ గురువారం ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహించిన రెండు రోజుల తర్వాత(అక్టోబర్ 19న) ఫలితాలు ప్రకటిస్తారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ పదవి నుంచి సోనియా తప్పుకోనుండటం, బాధ్యతల స్వీకరణకు రాహుల్ మొగ్గుచూపకపోవడం వంటి పరిణామాల మధ్య ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా వరుస ఓటములు.. సీనియర్లు, కీలకనేతల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకు రావడమే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరుగుతాయన్న కాంగ్రెస్ పార్టీ.. అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు సోనియా, రాహుల్ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సరైన స్పష్టత లేకపోయినప్పటికీ రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కోరుకుంటే అధ్యక్ష పదవికి నామపత్రాలు దాఖలు చేస్తానని అశోక్ గహ్లోత్ తెలిపారు. పార్టీ ఇచ్చిన ఏ బాధ్యత అయినా నెరవేర్చుతానని చెప్పారు. అయితే, చివరిసారిగా.. రాహుల్ గాంధీని పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరతానని అన్నారు. అయితే.. ప్రస్తుతానికి తాను పూర్తి స్థాయిలో భారత్ జోడో యాత్రపైనే దృష్టిపెట్టానని, అధ్యక్ష ఎన్నికలకు దూరమని పార్టీ వర్గాలు ఇటీవల సంకేతాలిచ్చాయి.
ఇద్దరిలో ఎవరు?
పోటీలో అశోక్ గహ్లోత్, శశిథరూర్ ఉండటం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు జోరందుకున్నాయి. గెలుపు పవనాలు గహ్లోత్ వైపే వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదు దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారు గహ్లోత్. పార్టీ నిర్వహణ, ఎన్నికలు ఎదుర్కోవడం వంటి అంశాల్లో విశేష అనుభవం ఆయన సొంతం. ప్రజల నేతగా, సామాన్యుడిగా పేరుంది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. హిందీ మాట్లాడే వ్యక్తి కావడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించగలరు.
కాగా, పోటీలో ఉన్న మరో నేత శశిథరూర్.. వీటన్నింటికీ భిన్నమైన వ్యక్తి. ఆయన 2009లో కాంగ్రెస్లో చేరారు. మాస్ లీడర్ కాకపోవడం బలహీనత. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపేంత వ్యక్తి కాదు. అంతకుమించి.. పార్టీలో విభేదాలు భగ్గుమన్న సమయంలో గాంధీ కుటుంబానికి వ్యతిరేక బృందంలో ఉన్నారు. జీ23 నేతలతో కలిసి సోనియాకు లేఖ రాశారు. అందువల్ల ఎన్నికల్లో వీరిద్దరూ ఉంటే గహ్లోత్నే విజయం వరించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.