Congress President Election 2022 : అక్టోబర్ 26న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌నేత మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే ఈ మేరకు తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా.. తాము కలిసికట్టుగా పోరాడతామని ఖర్గే స్పష్టం చేశారు. రాజ్యాంగానికి ముప్పుగా పరిణమిల్లే వాటిని అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తనతో పోటీ పడిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు, పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి, శ్రేణులకు ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు.
'ఈ విజయం ఖర్గేది కాదు.. యావత్ కాంగ్రెస్‌ది' : అధ్యక్ష ఫలితాలపై స్పందించిన శశిథరూర్.. ఈ విజయం ఖర్గేది కాదని యావత్ కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. ఈ ఎన్నికలు పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని అందించిందని తెలిపారు. బలమైన భారతదేశం కావాలంటే.. బలమైన కాంగ్రెస్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఖర్గేకు అభినందనల వెల్లువ: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీతో కలిసి ఖర్గే ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. మల్లికార్జున ఖర్గేకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఆయన అపార అనుభవం, సిద్ధాంతాలు పార్టీకి ఎదుగుదలకు సాయపడతాయన్నారు. చారిత్రక బాధ్యతలు చేపట్టిన ఖర్గే.. పార్టీకి మార్గ నిర్దేశం చేస్తారని రాహుల్ అన్నారు.
అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశిథరూర్.. ఖర్గే ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మల్లికార్జు ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీ కాలం ఫలప్రదంగా కొనసాగాలని ఆకాంక్షించారు.