తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హస్త'వాసి బాగాలేదు.. దుర్బల నాయకత్వమే కాంగ్రెస్​కు గుదిబండ! - సోనియా గాంధీ

Congress Party: కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పంజాబ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లతో పాటు మేఘాలయ, గోవా లాంటి చోట్ల కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలోనైనా తక్షణమే మేలుకోకపోతే, సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం పొంచే ఉంది!

congress
సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ

By

Published : Dec 29, 2021, 7:36 AM IST

Congress Party: నూరేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్‌ పీఠాన్ని సైతం మరోసారి నిలబెట్టుకోవడం కష్టసాధ్యంగానే ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో తాజాగా చేసిన మంత్రివర్గ విస్తరణతో బలీయమైన పైలట్‌ వర్గాన్ని సంతృప్తి పరచగలిగినా, ఇంకా అసంతృప్తుల బెడద పూర్తిగా వీడనేలేదు. రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేకపోయినా, కచ్చితంగా తాము మరోసారి అధికారంలోకి రాగలమన్న ధీమా మాత్రం ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల్లో కనిపించడం లేదు. ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌లోనూ వర్గపోరు ముమ్మరమైంది. ఆ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని భావించిన కాంగ్రెస్‌ పార్టీకి, ఇప్పుడు అక్కడా నిరాశజనక పరిస్థితులే అలముకుంటున్నట్లు విదితమవుతోంది. మేఘాలయలో ఇటీవల పలువురు కాంగ్రెస్‌ శాసనసభ్యులు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల తరవాత చేతులారా అధికారాన్ని వదులుకున్న గోవాలో పలువురు నాయకులు ఇటీవల ప్రియాంకాగాంధీ వాద్రా పర్యటించిన రోజే పార్టీకి రాజీనామా చేశారు. దక్షిణ గోవాకు చెందిన సీనియర్‌ నేత మోరెనో రెబెలో సైతం ఆ పార్టీకి టాటా చెప్పేశారు.

ఓట్లకు గండి

పంజాబ్‌లో మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసిన తరవాత- కొత్త నాయకత్వంతో పార్టీ పరిస్థితులు చక్కబడతాయని ఆశించిన అధిష్ఠానానికి నిరాశే మిగిలింది. కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ రాష్ట్ర రాజకీయాలను చక్కబెడతారని, దళిత ఓటు బ్యాంకును పటిష్ఠం చేస్తారని భావించినా- ఆ దిశగా ఎలాంటి చర్యలూ కనిపించలేదు. ముఖ్యమంత్రిని మార్చినా పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ మెత్తబడలేదు. రాష్ట్రంలో పార్టీని పటిష్ఠపరచేందుకు ఎలాంటి కసరత్తూ చేపట్టలేదు. పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ) పేరిట కొత్త పార్టీ పెట్టిన కెప్టెన్‌ ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆకర్షించారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లోనూ చాలామంది ఆయన వెంట నడిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. 'సాగు చట్టాల ఉపసంహరణ' తరవాత భాజపాతోనూ కెప్టెన్‌కు పొత్తు కుదిరింది. అకాలీదళ్‌లోని కొన్ని చీలిక వర్గాలు సైతం పీఎల్‌సీతో కలిసి సాగేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుకు పంజాబ్‌లో పెద్దగండి పడే ప్రమాదం కనిపిస్తోంది. రాజస్థాన్‌లో పదవుల పంపకంతో పైలట్‌ వర్గాన్ని సంతృప్తి పరచామని భావిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌కు అసంతృప్తుల బెడద వీడలేదు. అనర్హులకు అందలాలు కట్టబెట్టారని, మహిళలను విస్మరించారనే విమర్శలున్నాయి. గత సంవత్సరం సంక్షోభ సమయంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన 13 మంది స్వతంత్రులు, బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆరుగురిలో ఒక్కరికే కొత్త మంత్రివర్గంలో చోటుదక్కింది. దీనిపై అసంతృప్త గళాలు గట్టిగా వినిపిస్తుండటంతో, రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని పార్టీ అధిష్ఠానం ఆందోళన చెందుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో సీఎం భూపేష్‌ బాఘేల్‌ను తప్పించి, కాంగ్రెస్‌ సంప్రదాయం ప్రకారం వేరే ముఖ్యమంత్రిని రంగంలోకి తెస్తారనే ప్రచారం జరిగినా, తరవాత అంతా సద్దుమణగినట్లే కనిపించింది. అయితే, రాష్ట్ర ఆరోగ్యమంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌ రూపంలో బాఘేల్‌ పదవికి ముప్పు పొంచి ఉన్నట్లు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సామేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

నిష్క్రియాపరత్వం..

అధికారంలో లేకపోయినా మేఘాలయ, గోవా లాంటి చోట్ల కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 12 మంది ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా నేతృత్వంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిపోయారు. మూడింట రెండొంతుల మంది ఉండటంతో, పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం పరిధిలోకి రాకుండా తప్పించుకున్నారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి చర్యా తీసుకోవడానికి వీల్లేకుండా పోయింది. తృణమూల్‌ తరఫున వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌ మంత్రాంగం వల్లే వారంతా దీదీ గూటికి చేరినట్లు చెబుతున్నారు. మరోవైపు, పీసీసీ అధ్యక్షుడిగా విన్సెంట్‌ పాలాను నియమించడంతో అసంతృప్తికి గురైన నేతలు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవా కాంగ్రెస్‌లోనూ అసంతృప్తుల జోరు ఎక్కువగానే ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం అక్కడ పార్టీ నేతల రాజీనామాలకు దారితీసింది. అసలు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై పార్టీకి ఏమాత్రం స్పష్టత కనిపించడం లేదని, అధిష్ఠానం పెద్దపీట వేస్తున్న కొందరు నాయకుల తీరువల్లే ఇలా జరుగుతోందని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. పలు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా అధిష్ఠానం తగిన చర్యలు తీసుకోకపోవడం అగ్రనేతల నిష్క్రియాపరత్వాన్ని సూచిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలోనైనా తక్షణమే మేలుకోకపోతే, సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం పొంచే ఉంది!

- కామేశ్వరరావు

ABOUT THE AUTHOR

...view details