తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దశాబ్ద కాలంగా.. 'హస్తం'లో గెలుపు రేఖలు అదృశ్యం! - 2019 పార్లమెంట్ ఎన్నికలు

congress party: దేశంలోనే పురాతన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పంజాబ్​లో ఓటమితో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. 2013 నుంచి ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. 2014లో ప్రధానిగా మోదీ ఎన్నికయ్యాక క్రమంగా.. కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని మరింత కోల్పోయింది.

congress party downfall
కాంగ్రెస్ పార్టీ వైఫల్యం

By

Published : Mar 10, 2022, 10:26 PM IST

congress party: 135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ దాదాపు అర్ధశతాబ్దానికి పైగా భారత్‌ను పాలించింది. స్థానికంగా కొత్తగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా బలమైన క్యాడర్‌తో దశాబ్దాల పాటు పలు రాష్ట్రాలను ఏకధాటిగా ఏలింది. సోనియాగాంధీ రాకతో పూర్వవైభవం వచ్చిందనుకొన్న ఆ పార్టీకి.. నరేంద్ర మోదీ ఎంట్రీ చెక్‌ పెట్టినట్లు అయ్యింది. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటినుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి. తాజాగా పంజాబ్‌లోనూ అధికారాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.

13 రాష్ట్రాల నుంచి రెండుకు..

ప్రధానమంత్రిగా మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్న సమయంలో దేశ రాజకీయాల్లో మరోసారి బలమైన శక్తిగా కొనసాగింది. ఇలా 2011 నాటికి 11 రాష్ట్రాల్లో (రాజస్థాన్‌, దిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ (ఉమ్మడి), కేరళతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మేఘాలయ, మణిపుర్‌, మిజోరం) కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మొత్తం 13 రాష్ట్రాల్లో తన సత్తాను చాటింది.

కేంద్రంలో యూపీఏ కూటమి రెండో పర్యాయం ముగుస్తోన్న సమయంలో దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచాయి. 2014లో నరేంద్ర మోదీ రాకతో జాతీయ స్థాయిలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీకి.. అప్పటినుంచి ఆయా రాష్ట్రాల్లో జరుగుతోన్న ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి తప్పడం లేదు. పెద్ద రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది. తాజాగా పంజాబ్‌లోనూ ఓడిన కాంగ్రెస్‌ పార్టీ, చివరకు రెండు (రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌) రాష్ట్రాలకే పరిమితమైంది. 2011 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌ అధికారం కోల్పోతున్న రాష్ట్రాలను చూస్తే..

  • 2011లో అస్సాం, కేరళలో విజయంతో 11 రాష్ట్రాల్లో అధికారంలో నిలిచింది.
  • 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో విజయం. గోవాలో ఓటమి. కాంగ్రెస్‌ అధికారం 13 రాష్ట్రాలకు చేరింది.
  • 2013లో కర్ణాటకలో గెలిచి, రాజస్థాన్‌లో ఓడింది. అదే ఏడాది మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు.
  • 2014 జనరల్‌ ఎలక్షన్లలో ఓటమి. కీలకమైన మహారాష్ట్ర, దిల్లీ, హరియాణాల్లోనూ ఘోర పరాభవం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణ ఓటమి.
  • 2015 నాటికి ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళతోపాటు ఐదు ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
  • 2016 ఎన్నికల్లో అస్సాం, కేరళ, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో అధికారం కోల్పోయింది.
  • 2017లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓటమి పాలయ్యింది.
  • 2018లో మిజోరం, మేఘాలయా రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పోయింది. అయితే, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌.. కాస్త ఊపిరి పీల్చుకుంది.
  • 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఓటమిని చవిచూసింది.
  • 2021 ఐదు రాష్ట్రాల ఎన్నికలు. పుదుచ్చేరి, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్‌లో ప్రభావం చూపలేకపోయింది. ఒక్క తమిళనాడులో మాత్రం మిత్రపక్షం డీఎంకే అధికారంలోకి వచ్చింది.
  • ప్రస్తుత ఐదు రాష్ట్రాల మినీ సంగ్రామంలోనూ కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. పంజాబ్‌లోనూ ఆ పార్టీ అధికారాన్ని కోల్పోతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో పుంజుకోలేకపోయింది. అంతేకాకుండా ఉన్న స్థానాలనూ కాపాడుకోలేకపోయింది. గోవా, మణిపుర్‌లలోనూ వెనుకంజే.

ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోనే కొనసాగుతోంది. ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల్లో కొనసాగుతోన్న కాంగ్రెస్‌. మరో మూడు రాష్ట్రాల్లోనే సొంత బలంతో నెట్టుకొస్తోంది. తాజా ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన పంజాబ్‌లోనూ ఓటమి చెందడంతో చివరకు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లకే కాంగ్రెస్‌ పరిమితమయ్యింది.

ప్రధాని మాటల్లో కాంగ్రెస్‌ గ్రాఫ్‌..

గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చూస్తుంటే మరో వందేళ్ల వరకు అధికారంలోకి రాదంటూ ఇటీవల జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పార్టీని దుయ్యబట్టారు. కొన్ని దశాబ్దాలుగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఆదరణ దక్కడం లేదని చెబుతూ పలు రాష్ట్రాల పేర్లను ఆయన ప్రస్తావించారు.

  • 1998 నుంచి నాగాలాండ్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు - 24ఏళ్లుగా
  • 1995 నుంచి ఒడిశా ప్రజలు కాంగ్రెస్‌ను దూరం ఉంచారు - 27ఏళ్లుగా
  • 1988నుంచి త్రిపుర ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారు - 34 ఏళ్లుగా
  • 1985 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌ ప్రజలు కాంగ్రెస్‌ను దూరం పెట్టారు - 37 ఏళ్లుగా
  • 1972 నుంచి పశ్చిమ బెంగాల్‌ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టలేదు - 50 ఏళ్లుగా

ఇదీ చదవండి:ఈ ఫలితాలు దేశానికి గొప్ప సందేశం: మోదీ

బీఎస్పీ సంప్రదాయ ఓటు బ్యాంక్​ గల్లంతు.. లాభించింది వారికే..

ABOUT THE AUTHOR

...view details