పార్లమెంట్ రెండోవిడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ జగధీప్ ధన్‌ఖడ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక బిల్లు ఆమోదమే తమ ప్రాధాన్యత అని కేంద్రం పేర్కొనగా.. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని సీబీఐ, ఈడీ దాడులు, అదానీ గ్రూపుపై ఆరోపణలు వంటి అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై తమ పార్టీ చర్చకు పట్టుబడుతూనే ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆర్థికబిల్లు ఆమోదమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. ప్రతిపక్షాల డిమాండ్లపై స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
ED, CBI దాడులే ప్రతిపక్షాల టార్గెట్.. ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవాకాశాలున్నాయి. ఈ మేరకు ప్రతిపక్షాలు వ్యూహాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
మరోవైపు సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ రెండోవిడత బడ్జెట్ సమావేశాల్లో వివిధ అంశాలపై అధికారపక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, హిండెన్‌బర్గ్ నివేదికతో పాటు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం.. మల్లిఖార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీలు సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు, చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీయనున్నాయి. దీంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ లాంటి పథకాలకు నిధులు నిలిపివేయడంపై ప్రశ్నించే అవకాశం ఉంది. ఈసారి అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ జన్‌దీప్ ధన్‌ఖడ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశాల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంది. కాగా, పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31న మొదలై ఫిబ్రవరి 13వరకు కొనసాగాయి. అనంతరం నెల రోజుల పాటు వచ్చిన విరామంలో వివిధ శాఖలకు కేటాయించిన బడ్జెట్ పద్దులను అన్ని స్థాయీ సంఘాలు నిశితంగా పరిశీలించాయి. అవి సమర్పించిన నివేదికలపై చర్చ, ఆమోదం తెలుపుతారు. సోమవారం (మార్చి 13) నుంచి రెండో విడత సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 6వరకు ఇవి కొనసాగుతాయి.