త్వరలో జరగనున్న శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్లమెంట్ స్ట్రాటజీ కమిటీ సమావేశమైంది. దిల్లీలోని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi News) నివాసంలో నేతలు భేటీ అయ్యారు. సమావేశాల్లో మొదటి రోజైన నవంబర్ 29న రైతుల సమస్యలతో పాటు, కనీస మద్దతు ధర, లఖింపుర్ ఖేరీ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించడం వంటి డిమాండ్లతో ముందుకు రానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు.
వివిధ సమస్యలపై ఉభయ సభల్లో పోరాడేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్ని పార్టీల నేతలతో సమావేశమవుతామని స్పష్టం చేశారు.
పార్లమెంట్‌లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. వివిధ సమస్యలపై సభల్లో పోరాడేందుకు కృషి చేస్తున్నాం. విపక్షాలు కూడా మద్దతుగా నిలవాలి. ప్రస్తుతం ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరలు, సరిహద్దుల్లో చైనా దురాక్రమణ, జమ్ము కశ్మీర్ సమస్యలతో సహా పలు అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని ఈ రోజు జరిగిన సమావేశంలో నిర్ణయించాం.