Congress on Agniveer Scheme :సైనిక బలగాల నియామకం కోసం ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. ఎన్నికల్లో దాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని భావిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా యువత మద్దతును కూడగట్టుకునేందుకు అగ్నిపథ్‌పై ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సైనికుల విభాగం ఇప్పటికే ఈ విషయంపై ఓ సదస్సు నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రెండు నెలల క్రితం విస్తృత చర్చలు జరిపింది. ఈ విభాగం ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఓ ఫుట్ మార్చ్ సైతం జరిగింది. అక్టోబర్ 29న రాజస్థాన్‌లోని ఝుంఝునూ, మండావా ప్రాంతాల్లో మరో రెండు ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
Congress Campaign Against Agniveer :అగ్నిపథ్ ద్వారా సైన్యంలో చేరిన జవాన్లు యుద్ధానికి సిద్ధంగా ఉండే అవకాశం తక్కువ అని కాంగ్రెస్ పార్టీ మాజీ సైనికుల విభాగం ఛైర్మన్ విశ్రాంత కర్నల్ రోహిత్ చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అగ్నివీరుడికి తగిన పరిహారం ఇవ్వడం లేదని అన్నారు. సాధారణ సైనికులకు, అగ్నివీరులకు అనేక తేడాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
"అగ్నిపథ్ వల్ల సైన్యంలో రెండు రకాల జవాన్లు తయారవుతారు. ఇది సైనిక దళాలను దెబ్బతీస్తుంది. దీన్ని మేం వ్యతిరేకిస్తూనే వస్తున్నాం. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దీన్ని ప్రాధాన్యంగా తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సమస్యపై రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో గళమెత్తుతాం. ఎన్నికల ఫలితంపై ఈ సమస్య ప్రభావం ఉంటుందని భావిస్తున్నాం. సాయుధ దళాలపై బలవంతంగా రుద్దిన ఈ స్కీమ్‌ను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. సాధారణ సైనికుడికి, అగ్నివీర్‌కు మధ్య తేడా ఏంటనేది మా ర్యాలీలలో చెబుతున్నాం."
- విశ్రాంత కర్నల్ రోహిత్ చౌదరి, కాంగ్రెస్ మాజీ సైనికుల విభాగం ఛైర్మన్
Agniveer vs Normal Recruitment :'అగ్నివీర్ శిక్షణకు, సాధారణ సైనికుల శిక్షణకు చాలా తేడా ఉంది. సాధారణ సైనికుడికి యుద్ధానికి సన్నద్ధంగా ఉండేలా శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా వారిని మోహరించవచ్చు. ఆరు నుంచి ఎనిమిదేళ్ల వరకు వారు పని చేస్తారు. ఏడాదిన్నర ట్రైనింగ్ తర్వాత నాలుగు నుంచి ఆరేళ్ల పాటు వివిధ యుద్ధ కోణాల గురించి శిక్షణ పొందుతారు. కానీ, అగ్నివీర్ మాత్రం ఆరు నెలల శిక్షణ పొందుతారు. ఏడాది లీవ్ ఉంటుంది. రిటైర్ అవ్వాడానికి రెండున్నర సంవత్సరాల ముందు వారిని డిప్లాయ్ చేస్తారు' అని విశ్రాంత కర్నల్ చౌదరి పేర్కొన్నారు.