సెప్టెంబర్ 30న బంగాల్లోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చెయరాదని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) బరిలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతను చాటాలనే ఉద్దేశంతోనే ఈ అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి అధికారిక ప్రకటన చేస్తారని చెప్పాయి.
ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన మమత.. భాజపాను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల ఐక్యత ప్రాముఖ్యాన్ని తెలియజేశారు.
'భాజపా డబ్బులు వృథా చేసుకోవద్దు'
భవానీపుర్ ఉప ఎన్నికలో(west bengal by election 2021) మమతా బెనర్జీపై పోటీ చేసి డబ్బులు వృథా చేసుకోవద్దని టీఎంసీ నేత మదన్ మిత్రా భాజపాకు హితవు పలికారు. అక్కడ వార్ వన్ సైడే అని, దీదీ విజయం నల్లేరుపై నడకేనని స్పష్టం చేశారు.
బంగాల్ దక్షిణ కోల్కతాలోని భవానీపుర్ సహా ముర్షీదా బాద్ జిల్లాలోని జంగీపుర్, సంసీర్గంజ్ నియోజకవర్గాలకు ఈనెల 30న ఉపఎన్నికలు(west bengal bye election 2021) నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యుర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ. 14న వీటిని పరిశీలిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెలువడతాయి.