Prashant Kishor News: దేశంలో కాంగ్రెస్ పార్టీ పునరుత్థానానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లోని 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని.. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాతో జట్టు కట్టాలని సూచించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బయటికొచ్చింది. తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి వెళ్లడం మేలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారు. జమ్మూ-కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లాలని సూచించారు. ఈ పార్టీలన్నీ 2019 ఎన్నికల్లో 128 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 249 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచినట్లు ప్రశాంత్ కిశోర్ ఉటంకించారు. మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన సీట్లన్నీ కలిపితే 377 అవుతాయని, వచ్చే ఎన్నికల్లో వీటిపై దృష్టి సారిస్తే భారీగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భాజపాతో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీచేసి, మిగిలిన చోట్ల 5-6 పార్టీలతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకుంటే పార్టీ విజయావకాశాలు గణనీయంగా మెరుగవుతాయని ప్రతిపాదించారు.
సంస్థాగత మార్పులు కూడా..: కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు కూడా చేపట్టాలని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇందుకుగాను రెండు రకాల ప్రతిపాదనలు చేశారు. 1 - యూపీఏ ఛైర్‌పర్సన్‌గా పాతతరం కాంగ్రెస్ నాయకుడిని పెట్టి, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగడం. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గాంధీయేతర కుటుంబ సభ్యుడిని నియమించడం. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్‌గాంధీని ఎన్నుకోవడం. కోఆర్డినేషన్ జనరల్ సెక్రటరీగా ప్రియాంకా గాంధీని నియమించడం. (లేదా) 2 - సోనియాను యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడం, కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబ సభ్యుడిని నియమించడం. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్‌గాంధీ, కోఆర్డినేషన్ జనరల్ సెక్రటరీగా ప్రియాంకా గాంధీని ఎన్నుకోవడం. రాహుల్‌ను పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయడం వల్ల చట్టసభలో ప్రధాని ‘వర్సెస్’ రాహుల్ గాంధీగా మారుతుందని, దీనివల్ల ప్రజల గొంతును పార్లమెంటు లోపల, బయట బలంగా వినిపించడానికి వీలవుతుందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇకమీదట పార్టీలో ‘ఒక వ్యక్తి - ఒకే పదవి’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించాలని సూచించారు. అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించి పార్టీ అనుబంధ సంస్థలను ప్రక్షాళన చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా 15 వేల మంది నిబద్ధత గల నాయకులను, కోటి మంది క్రియాశీలక కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ ప్రధాన బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. పార్టీ సంస్థాగతంగా రెండు విధాలుగా పని చేయాలని సూచించారు. ఒక విభాగం కాంగ్రెస్‌ను ‘పాన్ ఇండియా పార్టీ’గా విస్తరించడంపై దృష్టి సారిస్తే, రెండో విభాగం 2024 ఎన్నికలకు అవసరమైన బలమైన వ్యవస్థను సృష్టించే పనిలో నిమగ్నం కావాలని పేర్కొన్నారు.