కరోనా టీకా పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. 21శాతం మందికి మాత్రమే రెండుడోసులు పంపిణీ చేసి 31శాతం మందికి వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. గతంలో హామీ ఇచ్చినట్లు ఈ ఏడాది చివరికల్లా 18 ఏళ్లుపైబడిన అందరికీ ఏవిధంగా టీకా పంపిణీ చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని హస్తం పార్టీ డిమాండ్ చేసింది.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ద్రవ్యోల్బణం, ఉగ్రవాదం గురించి ప్రస్తావించకపోవటాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ తప్పుపట్టారు. కరోనాతో చనిపోయిన 4 లక్షల 53వేల మందికి సంతాపం తెలపకుండా.... ప్రధాని సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.