అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు క్షమాపణలు చెప్పారు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత. ఆమెను రాష్ట్రపత్ని అనడం రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో ఈమేరకు లేఖ రాశారు. "మీరు చేపట్టిన అత్యున్నత పదవి గురించి చెప్పేందుకు పొరపాటున తప్పుడు పదం వాడినందుకు విచారం వ్యక్తం చేసేందుకు ఈ లేఖ రాస్తున్నా. నోరు జారడం వల్లే ఇలా జరిగింది. నన్ను క్షమించండి" అని లేఖలో పేర్కొన్నారు అధీర్.
ఐ యామ్ వెయిటింగ్: అంతకుముందు.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు అధీర్. తనపై భాజపా తీవ్రవాది ముద్ర వేసి ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. "గిరిజనులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ దేశంలో జరుగుతున్న కొన్ని హత్యలకు వెనుక కారణాలను కప్పిపుచ్చుతున్నారు. సోనియా గాంధీ హయాంలో రూపొందించిన చట్టాలను మార్చేస్తున్నారు. గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు." అని అధీర్ వ్యాఖ్యానించారు.