Congress MLA Candidate List 2023 :నవంబర్‌లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సైమీ ఫైనల్‌గా భావించే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో భాగంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటిందింది. ఛత్తీస్‌గఢ్‌లో 30 మంది, తెలంగాణలో 55 మంది అభ్యర్థులతో మొదటి లిస్ట్‌ను విడుదల చేసింది.
Madhya Pradesh Assembly Election 2023 : మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ను ఛింద్వాఢా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్.. రఘీగథ్ స్థానం నుంచి పోటీలో దిగారు. జైవర్ధన్ సింగ్ కమల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక బుధనీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పోటీగా నటుడు విక్రమ్ మస్తాల్‌ను బరిలోకి దింపింది. 150 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి సుదీర్ఘ మేధోమథనం తర్వాత 144 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.
Chhattisgarh Assembly Election 2023 : ఛత్తీస్‌గఢ్‌లో.. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను, అంబికాపుర్ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియోను కాంగ్రెస్ పోటీకి దింపింది. అయితే ఛత్తీస్‌గఢ్‌లో అభ్యర్థుల ఎంపికలో చాలా రోజులుగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పాత నాయకులు తమకు టికెట్ వస్తుందో లేదో అని సందేహం వ్యక్తం చేయగా.. పాత నాయకుల్లో అర్హులైన వారికి కచ్చితంగా టికెట్ కేటాయిస్తామని అంతకుముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.